మరికల్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఢిల్లీ ఎన్‌క్విఏఎస్ వైద్య బృందం పరిశీలించింది. రెండు రోజుల పాటు జరిగే పరిశీలన కార్యక్రమంలో మొదటి రోజు డాక్టర్ అమర్‌బోది, డాక్టర్ రోణక్‌శర్మ ఆస్పత్రి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. రోజువారీగా ఆస్పత్రికి వచ్చే ఓపీ రోగుల వివరాలు, గర్ణిణులు, బాలింతలకు అందిస్తున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెలవారీగా జరిగే ప్రసవాల సంఖ్యను రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహించరాదన్నారు. నిత్యం వచ్చే ఓపీ రోగులతో పాటు గర్భిణులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులు ముందుండాలన్నారు. డాక్టర్ రాకేష్, సిబ్బంది అరవింద్, బస్వరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.