● 2011 ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనల ప్రకారం ప్రభుత్వం కార్బైడ్, ఎసిటిలిన్ రసాయనాలను నిషేధించింది.
● సహజంగా పండించే ఇథిలిన్‌ను మాత్రమే 100 పీపీఎం వరకు వినియోగించేందుకు అనుమతిచ్చింది
● ప్రభుత్వ నిబంధనల ప్రకారం సుమారు 20 కిలోల పండ్లకు 5 గ్రాముల ఇథిలిన్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
● వ్యాపారులు మేలిమి పండులా కనిపించేందుకు కార్బైడ్‌ను వినియోగిస్తున్నారు. ఆమోదించిన ఇథిలిన్‌తో పోలిస్తే కార్బైడ్, ఇతర రసాయనాలు మార్కెట్లో చౌకగా లభిస్తుండడంతో వాటిని వ్యాపారులు యథేచ్ఛగా వాడుతున్నారు.
విజయనగరం: వేసవి ప్రారంభమైంది. మార్కెట్లో ఫలాలు నోరూరిస్తున్నాయి. కొందరు వ్యాపారుల అత్యాశ కారణంగా ఫలరాజుగా పేరొందిన మామిడి విషతుల్యంగా మారుతోంది. ప్రస్తుతం కాయలను కృత్రిమంగా ముగ్గబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలను వ్యాపారులు వినియోగిస్తున్నారు. వాటి వినియోగం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తప్పని ముప్పు..
రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లను తింటే ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదముంది. దీర్ఘకాలంగా ఇలాంటి పండ్లను తీసుకోవడం ద్వారా కేన్సర్, అల్సర్, కాలేయం (లివర్), మూత్రపిండం(కిడ్నీ), జీర్ణ సంబంధిత వ్యాధులు, కాళ్లు, చేతుల తిమ్మిర్లు, నరాల బలహీనతకు గురయ్యే ఆస్కారముంది. కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలిన్ వాయువు నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, శక్తిని కోల్పోయే ప్రమాదముంది. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. గర్భిణుల్లో హార్మోన్లు దారి తప్పుతాయి.
రంగును చూసి
గుర్తించొచ్చు
రంగును చూసి పండ్లను చాలా వరకు గుర్తించే అవకాశముంది. కార్బైడ్, ఇతర రసాయనాలు ఉపయోగించిన మామిడి పండ్లు బయటికి లేత పసుపు, లోపల లేత తెలుపు రంగులో ఉంటాయి. సహజంగా పండిన పండు బయట, లోపల ఒకే వర్ణంలో ఉంటుంది. రసాయనాలు విడుదల చేసే ఎసిటిలిన్ వాయువుతో పండ్లు బయటి వైపు రంగు మారుతుందే తప్ప అంత రుచిగా ఉండవు.
పరిమితికి మించి కార్బైడ్
● మామిడి కాయలను ఎథ్రిల్ లిక్విడ్‌లో 5 నిమిషాలపాటు ముంచి మూడు, నాలుగు రోజులు నిల్వ చేస్తే సహజత్వానికి దగ్గరగా ముగ్గుగుతాయి. ముంచడం సాధ్యం కానిపక్షంలో ఎథ్రిల్ లిక్విడ్‌ను కాయలకు స్ప్రే చేస్తున్నారు.
● కాయలు 24 గంటల్లోనే మేలిమి పండులా కనిపించేందుకు పరిమితికి మించి కార్బైడ్‌ను వినియోగిస్తుండడంతో.. ఆరోగ్యానికి ముప్పు తప్పడం లేదు. ప్రభుత్వం ఆమోదించిన ఇథిలిన్‌తో పోలిస్తే కార్బైడ్, ఇతర రసాయనాలు మార్కెట్లో చౌకగా లభిస్తుండడంతో యథేచ్ఛగా వినియోగిస్తున్నారు.
రసాయనాలతో ముగ్గబెట్టి మార్కెట్‌లో విక్రయం
పండు రంగు చూసి ఖరీదు చేస్తున్న వినియోగదారులు
ఆరోగ్య సమస్యల బారిన పడి అవస్థలు
కల్తీ పండ్ల విక్రయాలపై పట్టించుకోని అధికారులు
తియ్యని పండ్ల వెనుక
చేదు నిజాలు ఇవే..
జైలు శిక్ష, జరిమానా..
ఆహార సురక్ష ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను మగ్గించకూడదు. కార్బైడ్ వాడిన పండ్లను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్‌తో ముగ్గబెట్టిన వారికి, అమ్మేవారికి ఏడాది జైలుశిక్ష, జరిమానా తప్పదు. –ఈశ్వరి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి, విజయనగరం


