నిబంధనలకు పాతర..!
విజయనగరం ఫోర్ట్:
జిల్లా పౌరసరఫరాల సంస్థలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ విధానంలో చేపట్టిన పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేశారు. అర్హతలు కాదని డబ్బులు ఇచ్చిన వారికే పోస్టులు కట్టబెట్టారన్నది వారి ఆరోపణ. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో దర్యాప్తునకు విజిలెన్స్ అధికారులను నియమించారు. కొద్ది రోజులుగా అధికారుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం. పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలను గుర్తించినట్టు తెలిసింది. దర్యాప్తు నివేదికను ఒకటి రెండు రోజుల్లో ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు సమాచారం.
● ఇదీ పరిస్థితి...
జిల్లా పౌరసరఫరాల సంస్థలో అకౌంటెంట్ గ్రేడ్–3 మూడు పోస్టులు (కాంట్రాక్టు పద్ధితిలో), డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు–01 (ఔట్ సోర్సింగ్), టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్–3 పోస్టులు–07 (కాంట్రాక్ట్ పద్ధతిలో) భర్తీకి 2023 నవంబర్ 25వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు. అకౌంటెంట్ పోస్టుకు ఎం.కామ్ విద్యార్హత, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఏదైనా డిగ్రీ, ఎం.ఎస్ ఆఫీస్ అప్లికేషన్స్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విద్యార్హతగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన కొద్ది నెలలకే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. 2024 ఆగస్టులో పోస్టులు భర్తీ చేశారు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన పోస్టుల భర్తీలో రోస్టర్ పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోస్టర్ పాటించకపోవడం వల్ల అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగం రాలేదని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులను అసలు ఇంటర్వ్యూకే పిలవలేదని చెబుతున్నారు. అకౌంటెంట్ పోస్టుల విషయంలో ఎస్సీ మహిళ కేటగిరికీ అభ్యర్థినికి పోస్టు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ రెండు రోస్టర్లు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ దర్యాప్తులో కూడా ఈ విషయం నిర్ధారణ అయినట్టు సమాచారం. కొన్ని పోస్టుల విషయంలో విద్యార్హత లేక పోయినప్పటకీ పోస్టులు కట్టబెట్టారన్న విమర్శలు ఉన్నాయి. విజిలెన్స్ అధికారుల దర్యాప్తుతో అర్హత లేకుండా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళా అభ్యర్థి పేరు ఉప్పలాపు భారతి. ఈమెది నెల్లిమర్ల ప్రాంతం. జిల్లా పౌరసరఫరాల సంస్థ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేశారు. అకౌంటెంట్ పోస్టుకు సంబంధించి అన్ని విద్యార్హతలు ఉన్నా ఆమెను ఇంటర్వ్యూకు పిలవలేదు. ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
దర్యాప్తు జరుగుతోంది
పోస్టులు భర్తీచేసిన సమయంలో జిల్లా మేనేజర్‌గా విధుల్లో చేరలేదు. పోస్టుల భర్తీ ప్రక్రియ తెలియదు. విజిలెన్స్ అధికారుల దర్యాప్తు జరుగుతోంది.
– బి.శాంతి, జిల్లా మేనేజర్,
సివిల్ సప్లయీస్
సివిల్ సప్లై ఉద్యోగ నియామకాల్లో
అవకతవకలు..!
అకౌంటెంట్ పోస్టుల భర్తీలో రోస్టర్ అమలు చేయలేదని ఆరోపణ
విచారణ చేపడుతున్న విజిలెన్స్
అధికారులు
పోస్టుల భర్తీకోసం డబ్బులు చేతులు మారాయన్న విమర్శలు
నిబంధనలకు పాతర..!


