వాజ్‌పేయి ఆదర్శనీయులు
విజయనగరం రూరల్: మాజీ ప్రధాని, భారతరత్న ఏబీ వాజ్‌పేయి ఆదర్శనీయులని, ఆయన చూపిన మార్గంలోనే నరేంద్ర మోదీ సర్కారు పయనిస్తోందని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్రవ్యాప్త సుపరిపాలన (బస్సు) యాత్రలో భాగంగా శుక్రవారం విజయనగరం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధికి వాజ్‌పేయి అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఆయన సంస్కరణ వాది అని కొనియాడారు. ఆయన స్థిరమైన నిర్ణయాలతో దేశం ఆర్థికంగా ముందుకు సాగుతుందని, నేడు దేశం ఆర్థికవృద్ధి రేటులో ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుకుందన్నారు. కొందరు దేశాధినేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మనది డెడ్లీ ఎకానమీ అని ఎద్దేవా చేస్తూ, పొరుగు దేశానికి సాయం చేయాలని చూసినా మన దేశం సాధిస్తున్న ప్రగతిని ప్రపంచ ఆర్థిక సంస్థలు కొనియాడుతున్నాయన్నారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. హింసా, వ్యసనాలకు లోనుకాకుండా మనం చేసే పనిమీద దృష్టి సారిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వాజ్‌పేయి ఆదర్శభావాలను ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమానికి ముందుగా విజయనగరం శివారు వై కూడలి వద్ద ఏర్పాటుచేసిన వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఆయన చూపిన మార్గంలోనే మోదీ సర్కారు పయనిస్తోంది
2047 నాటికి వికసిత్ భారత్
సుపరిపాలన యాత్రలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
వాజ్‌పేయి ఆదర్శనీయులు


