
జాతరో..జాతర
పైడితల్లి సిరిమాను పండగ చాటింపు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మనవి చెప్పిన తలయారులు అక్టోబరు 6న తొలేళ్లు, 7న సిరిమానోత్సవం భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించండి : ఈవో శిరీష
విజయనగరం టౌన్: తనను కొలిచిన వారికి కొంగుబంగారమై, చింతలు తీర్చే చింతమానును ఎంపిక చేసుకుని సిరిమానుగా మలుచుకుని సిరుల ఉత్సవానికి సిద్ధమవుతున్న చిన్నారి పైడితల్లి జాతర మహోత్సవాలకు భక్తులు పెద్దఎత్తున తరలిరావాలని ఊరూ.. వాడా పండగ వాతావరణం చేసుకోవాలని రామవరపు చినపైడిరాజు బృందం ఆదివారం సాయంత్రం చదురుగుడిలో కొలువైన అమ్మవారికి మనవి చెప్పి ఆలయం ఆవరణలో భాజాభజంత్రీలతో, మేళతాళాలల నడుమ పండగ చాటింపు వేశారు. డప్పు వాయిద్యాలతో, ధూపదీప నైవేద్యాలను అమ్మకు సమర్పించారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతీ ఏటా నిర్వహించే సిరిమాను జాతర ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేలా చూడాలని అమ్మను ప్రార్ధించారు. అనంతరం ఆలయం ఆవరణలో దండోరా వేశారు. అక్టోబరు 6న పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం, 7న సిరుల తల్లి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చాటింపు వేశారు. అక్కడ నుంచి డప్పు వాయిద్యాలతో కోట వద్దకు వెళ్లి కోట శక్తికి మనవి చెప్పి చాటింపు వేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష మాట్లాడుతూ అక్టోబరు 22 వరకూ పండగ ఘనంగా నిర్వహిస్తామని, ప్రధాన ఘట్టాలైన తొలేళ్ల సంబరాలు, సిరిమానోత్సవానికి చాటింపు ప్రక్రియ ఆనవాయితీగా వస్తోందన్నారు. నెల రోజుల పండగలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవాలని ఆమె కోరారు.

జాతరో..జాతర