
రోగులకు తప్పని ఇక్కట్లు..
విజయనగరం ఫోర్ట్: పక్క ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బి.సూర్యకుమారి. ఈమెది భోగాపురం ప్రాంతం. చర్మ సంబంధిత సమస్యతో శుక్రవారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చింది. ఇక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలని చీటి రాసి ఇచ్చారు. అది పట్టుకుని ఆస్పత్రిలోని లేబరేటరీ వద్దకు ఆమె వెళ్లగా..ఇక్కడ థైరాయిడ్ పరీక్ష జరగడం లేదని సిబ్బంది బదులిచ్చారు. బయట ప్రైవేట్ ల్యాబ్‌లో చేయించుకోవాలని సూచించారు. ఈ పరిస్థితి ఈమె ఒక్కరిదే కాదు. నిత్యం అనేక మంది రోగులకు ఈ పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో థైరాయిడ్ నిర్థారణ పరీక్షలు చేయక పోవడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు. ఇదే అదునుగా ల్యాబ్ నిర్వాహకులు ఒక్కో రోగి నుంచి రూ. 500 నుంచి 800 రూపాయల వరకు వసూల చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు చేయకపోవడంపై పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
రోజుకు15 నుంచి 20 మంది వరకు ..
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, డెంటల్, డెర్మాటాలజీ, పలమనాలజీ, జనరల్ సర్జరీ, ఎముకల విభాగం , న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, ఈఎన్‌టీ, నెప్రాలజీ, యురాలజీ, తదితర విభాగాలున్నాయి. ఓపీ విభాగాల్లో రోగులను పరీక్షించిన వైద్యులు థైరాయిడ్ వ్యాధి లక్షణాలు ఉన్న వారికి పరీక్ష చేయించుకోవాలని చీటీలు రాసి ల్యాబ్‌కు పంపిస్తారు. ఇలా రోజుకు 15 నుంచి 20 మంది రోగులకు థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు అవసరమవుతాయి. రెండు వారాలుగా థైరాయిడ్ పరీక్షలు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సూర్యకుమారి
సర్వజన ఆస్పత్రిలో అందుబాటులో లేని థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు
తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ల్యాబ్‌లకు పరుగు
రోగులకు వదులుతున్న చేతిచమురు
చర్యలు తీసుకుంటా..
నేను ఈ రోజే బాధ్యతలు స్వీకరించాను. ఎందువల్ల థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలు జరగడం లేదో తెలుసుకుంటాను. రెగ్యులర్‌గా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకుంటాను.
– అల్లు పద్మజ, సూపరింటిండెంట్ , ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

రోగులకు తప్పని ఇక్కట్లు..

రోగులకు తప్పని ఇక్కట్లు..