నొప్పితో రోదిస్తున్నా
కనికరం లేదాయె..!
చిత్రంలో కాలుకి కట్టుతో నేలపై సేదతీరుతున్న వృద్ధురాలి పేరు ఎర్రయ్యమ్మ. పూసపాటిరేగ గ్రామం. కాలుకు ఇన్‌ఫెక్షన్ కావడంతో నెలరోజుల కిందట విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందింది. అప్పట్లో కాస్త నయమైంది. మళ్లీ రెండు రోజుల కిందట ఇన్‌ఫెక్షన్ సోకడంతో వైద్యంకోసం కుటుంబ సభ్యులు ఆమెను అదే ఆస్పత్రికి సోమవారం ఉదయం తీసుకొచ్చారు. జనరల్ సర్జరీ విభాగంలో చూపించారు. కాలుకి డ్రెస్సింగ్ చేయాలని వైద్యులు సూచించడంతో డ్రెస్సింగ్ గది వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది లేక పోవడంతో తిరిగి జనరల్ సర్జరీ విభాగం వద్ద ఉన్న స్టీల్ టేబుల్‌పై కూర్చోబెట్టారు. నొప్పి భరించలేక వృద్ధురాలు నేలపై పడుకుని రోదిస్తున్నా సత్వర సేవలు అందించేందుకు సిబ్బంది ఎవరూ ముందుకు రాలేదు. కనికరించలేదు. కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం, సిబ్బందిని నిలదీయడంతో మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత డ్రెస్సింగ్ సేవలందించారు. – విజయనగరం ఫోర్ట్


