
భద్రతే లక్ష్యంగా విధుల నిర్వహణ
● ఏఐఎస్‌ఎమ్‌ఏ జనరల్ సెక్రటరీ నారాయణరావు
విజయనగరం టౌన్: భద్రతే లక్ష్యంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వే పని చేస్తోందని ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఎమ్‌ఏ) జనరల్ సెక్రటరీ పి.నారాయణరావు పేర్కొన్నారు. స్థానిక రైల్వే ఇనిస్టిట్యూట్‌లో డివిజనల్ సేఫ్టీ సెమినార్‌తో పాటూ ది ఆటోమెటిక్ బ్లాక్ సిస్టమ్‌పై అవగాహన, నూతన కార్యవర్గ నిర్ణయాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మరింత ఉన్నతమైన భద్రతాపరమైన విధులను నిర్వహించేందుకు ఎస్‌ఎమ్‌ఆర్‌లకు అప్‌డేట్స్‌ను ఇస్తూ, ప్రాధాన్యత కలిగిన అంశాలను ప్రస్తావించేందుకే సమావేశమయ్యామన్నారు. ఇప్పటివరకూ విజయనగరం, కొత్తవలసలో ఉన్న ఆటోమెటిక్ ట్రైన్ సిస్టమ్ పద్ధతిని త్వరలో విజయనగరం, రాయగడ ఆర్‌వీ లైన్, విజయనగరం పలాస మెయిన్ లైన్‌లో కూడా అమలు చేయబోతున్న తరుణంలో విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఎమ్‌ఆర్‌లకు అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. స్టేషన్ వర్కింగ్ రూల్‌లో వస్తున్న అప్‌డేట్స్‌పై ఉన్న సందేహాలను నివృత్తి చేశామని చెప్పారు. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలపై నేరుగా స్టేషన్ మాస్టర్‌లనే ప్రధాన నిందితులుగా చేర్చే వైఖరి వస్తున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు. డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 40 మంది ఎస్‌ఎమ్‌ఆర్‌లు పాల్గొని ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారన్నారు. వాటన్నంటినీ డివిజనల్ చీఫ్ అడ్వయిజర్‌లు, కార్యదర్శులు పరిష్కరించారన్నారు. కార్యక్రమంలో డివిజనల్ ఛీప్ అడ్వయిజర్ పిఎన్.మూర్తి, డివిజనల్ అధ్యక్షుడు ఎస్‌ఎన్.అహ్మద్, అధిక సంఖ్యలో స్టేషన్ మాస్టర్లు పాల్గొన్నారు.