
యోగాతో ఆరోగ్యకర జీవనం
విజయనగరం: యోగాతో ఆరోగ్యకర జీవనం సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. యోగాంధ్ర సాధన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన నెలరోజుల యోగాభ్యాసన కార్యక్రమానికి రాజీవ్ క్రీడా మైదానంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, జేసీ ఎస్.సేతుమాధవన్‌తో కలిసి బుధ వారం శ్రీకారం చుట్టారు. యోగా శిక్షకుల ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన సంస్కృతిలో యోగా ఒక భాగమని, దీనిని అందరూ అభ్యసించాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి విశాఖపట్నానికి వస్తుండడం సంతోషదాయకమన్నారు. ప్రతి ఒక్కరితో యోగాసనాలను అభ్యసన చేయించే ఉద్దేశంతో నెల రోజులపాటు కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యమని, ఆరోగ్య సాధనకు యోగా ఒక చక్కని మార్గమన్నారు. రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధుల నియంత్రణకు యోగా దోహదపడుతుందని చెప్పారు. జేసీ ఎస్.సేతు మాధవన్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొదటి వారం జిల్లా స్థాయిలో, రెండో వారం మండల స్థాయిలో అధికారులకు శిక్షణ ఇస్తామన్నారు. యోగా ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఇటీవల అరకులో నిర్వహించిన మహా సూర్యవందనంలో జిల్లా నుంచి పాల్గొన్నవారికి కలెక్టర్ చేతులమీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి, డీఎస్‌డీఓ ఎస్.వెంకటేశ్వరరావు, ఆయుష్ వైద్యాధికారులు వరప్రసాద్, ఆనందరావు, స్వప్నచైతన్య, పలువురు జిల్లా అధికారులు, యోగా శిక్షకులు, విద్యార్థులు, వివిధ సంస్థలు, అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.