
వివరాల నమోదు తప్పనిసరి
విజయనగరం ఫోర్ట్: స్కానింగ్ కోసం ల్యాబ్‌లకు వచ్చే గర్భిణులు ఎవరి రిఫరెన్స్‌తో వచ్చారో కచ్చితంగా రికార్డులో నమోదుచేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో ఆర్‌ఎంపీ (సంచి వైద్యులు) వైద్యులు రిఫర్ చేసిన కేసులకు స్కాన్ చేయొద్దన్నారు. నిబంధనలు పాటించని స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిపై పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏజెన్సీలో జ్వరాల తీవ్రతపై దృష్టి పెట్టాలి
● గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి
● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకరరావు
విజయనగరం అర్బన్: ఏజెన్సీలో గిరిజనులు జ్వరాలతో బాధపడుతున్నారని, మెరుగైన వైద్యం అందేలా అధికా ర యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజి శంకరరావు కోరారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందన్న పత్రికా కథనాలపై ఆయన స్పందించారు. మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, సాలూరు, కురుపాం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందని, వైద్య శిబిరాలు విరివిగా నిర్వహించేందుకు ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ముగిసిన సాఫ్ట్‌స్కిల్స్ శిక్షణ
విజయనగరం అర్బన్: సెంచూరియన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విజయనగరం ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు నిర్వహించిన 16 వారాల సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ప్రోగ్రాం కో ఆర్డినేటర్, సెంచూరియన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పి.ఎస్.వి.రమణారావు మాట్లాడుతూ ఇండస్ట్రీ 4.0 డ్రోన్లు, స్టార్టప్‌లు, ఉపాధి అవకాశాలు వంటి ఆధునిక అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చామన్నారు. అనంతరం విద్యార్థులకు శిక్షణ ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి, డాక్టర్ రంజన్ కుమార్ బెహరా, ఎ.కె.జెనా, ఉపాధ్యాయులు రమణాచారి పాల్గొన్నారు.
కలెక్టర్ చొరవతో
సీఎస్‌ఆర్ నిధులు
విజయనగరం అర్బన్: జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చొరవతో సీఎస్‌ఆర్ నిధులు మంజూరయ్యాయి. విద్య, వైద్య రంగాలకు నిధు లు కేటాయించారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు మెడికల్ కళాశాలలో వైద్యపరికరాల కొనుగోలుకు రూ.కోటి మంజూరు చేశారు. పూసపాటి రేగ మండలం నడిపల్లి, చింతపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల కోసం రూ.54.50 లక్షలు కేటాయించారు. భారత్ డైనమిక్ లిమిటెడ్ కంపెనీ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్స్ కోసం 37 ప్రభుత్వ పాఠశాలలకు రూ.కోటి, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల కోసం రూ.14.50 లక్షలు, గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్ కోసం రూ.7.16 లక్షలను మంజూరు చేసింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంస్థ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌కు జనరేటర్ కోసం రూ.11.34 లక్షలు మంజూరు చేసింది. బదిర బాలికల కోసం 45 బంకర్ బెడ్స్, 4 ఆర్‌ఓ ప్లాంట్‌లను మంజూరు చేసింది. నెల్లిమర్ల, గుర్ల, మెరకముడిదాం మండలాల్లోని 40 చెరువుల అభివృద్ధికి యాక్సిస్ బ్యాంక్ రూ.15 కోట్లు సీఎస్‌ఆర్ నిధులు మంజూరు చేసింది.

వివరాల నమోదు తప్పనిసరి