
యోగాంధ్రను విజయవంతం చేయాలి : జేసీ
విజయనగరం అర్బన్: జూన్ 21న అంతార్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల ముందు నుంచే యోగాపై పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు జేసీ, యోగా జిల్లా నోడల్ అధికారి సేతు మాధవన్ తెలిపారు. జూన్ 21న ప్రధాని మోదీ విశాఖలో పాల్గొంటారని, ఇది లైవ్ ద్వారా ప్రసారం జరుగుతుందని ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ యోగా చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండల అధికారులు, గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జేసీ పలు సూచనలు చేశారు. ఈ నెల 21 నుంచి క్యాంపెయిన్ ప్రారంభం అవుతుందని యోగా చేయడంపై ప్రజలలో చైతన్యం కలిగించి, ప్రతి ఒక్కరూ యోగాభ్యసనంలో పాల్గొనేలా చేయాలని తెలిపారు. ముందుగా మండలానికి ఇద్దరేసి యోగా శిక్షకులను గుర్తించి వారి ద్వారా టీఓటీలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, టీఓటీల ద్వారా మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జూన్ 16 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. జూన్ 16న ఫ్యామిలీ యోగా పేరుతో 4 తరాల కుటుంబ సభ్యులంతా పాల్గొనేలా చూడాలని, 17న సీనియర్ సిటిజన్స్ కోసం స్పెషల్ యోగా కార్యక్రమాలు ఉంటాయని, 18, 19 తేదీలలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో యోగా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 21న ఉదయం 7 గంటలకు రాజీవ్ క్రీడా ప్రాంగణంలో కర్టెన్‌రైజర్ కార్యక్రమం జరుగుతుందని, విద్యార్థులు, యువత, మహిళలు, అధికారులంతా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తెలిపారు. సందేహాలకు, సలహాల కోసం జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వరప్రసాద్ 9849167238 ఫోన్ నంబరు సంప్రదించాలని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఏ పీడీ కల్యాణచక్రవర్తి, ఆయుష్ వైద్యులు డాక్టర్ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డీఈవో యు.మాణిక్యంనాయుడు, డీఎస్‌వో మధుసూధనరావు, జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, డీఎస్‌డీవో మెప్మా పీడీ చట్టిరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.