
పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం
విజయనగరం: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్‌సీపీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నగరంలోని ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సోమవారం సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా పరిశీలకుడు కిల్లి సత్యనారాయణతో కలిసి పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలో పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా పార్టీ అనుబంధంగా ఉండే 29 విభాగాలకు సంబంధించి కమిటీల నియామకాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతివిభాగంలో పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులకు అవకాశం కల్పించాలని చెప్పారు. ప్రధానంగా మహిళలకు, యువతకు విభాగాల్లో ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో జిల్లా అధ్యక్షులతో పార్టీ అధినేత నిర్వహించిన సమావేశంలో వెల్లడించిన అంశాలను వివరించారు. పార్టీని అన్ని రంగాల్లో బలోపేతం చేయడంలో అనుబంధ కమిటీల అధ్యక్షులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, పార్లమెంటరీ జిల్లా పరిశీలకుల నియామక ప్రక్రియ పూర్తయిందని, త్వరలో రాష్ట్రస్థాయిలో వివిధ అనుబంధ సంఘాల నియామకాల ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు.
కార్యకర్తల్లో భరోసా నింపే బాధ్యత మీదే...
ఐదేళ్ల పాటు రాష్ట్రంలో పాలన సాగించి ప్రస్థుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తరుణంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో భరోసా నింపాల్సిన బాధ్యత అనుబంధ విభాగాల అధ్యక్షులపై ఉందని మజ్జి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. ఎన్నికలకు ముందు అబద్ధపు హమీలు గుప్పించి, ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ పాలనపై ఏడాది కాలంలోనే ప్రజావ్యతిరేకత మొదలైందన్నారు. ఏడాది కాలంలో ఇచ్చిన హమీల అమల్లో ఘోరంగా వైఫల్యం చెందిన కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పాలనలో లోపాలపై నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు. పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను ఆయా అనుబంధ విభాగాలు తీసుకోవాలని సూచించారు. పార్టీ బలంగా ఉన్నపుడే రానున్న ఎన్నికల్లో విజయావకాశాలు అందిపుచ్చుకోవచ్చని, అనుబంధ విభాగాల కమిటీల్లో సమర్ధవంతమైన వారికి స్థానం కల్పించాలని దిశానిర్దేశం చేశారు.
త్వరలో పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం..
వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయం త్వరలో ప్రారంభించనున్నమని మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. పార్టీ నాయకులంతా ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై అక్కడే సమావేశాలు నిర్వహించుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. పార్టీ సంస్థాగత నియామకాల్లో పదవులు దక్కించుకున్న వారి పని తీరుపై నిశిత పరిశీలన ఉంటుందని, పార్టీ విజయానికి దోహదపడే కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందన్నారు. సమష్టి కృషితోనే అధికారంలోకి రావడం సాధ్యమన్న విషయం గుర్తించాలన్నారు. పార్టీ బలోపేతంలో సోషల్‌మీడియా, యువజన విభాగం, విద్యార్థి విభాగాలు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా జిల్లా అధ్యక్షునిగా తాను, పార్టీ పరిశీలకునిగా నియామకమైన సత్యనారాయణ అందుబాటులో ఉంటామని భరోసా నిచ్చారు. సమావేశంలో జెడ్పీటీసీ వర్రి నర్సింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు. కిల్లి సత్యనారాయణను ఈ సందర్భంగా సత్కరించారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో భరోసా నింపే బాధ్యత మీదే..
పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు
విజయవంతం చేయాలి
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను
ఎండగట్టాలి
జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో దిశానిర్దేశం
హాజరైన పార్లమెంటరీ జిల్లా
పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ

పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం