
ఉద్యమబాటలో ఉపాధ్యాయులు
విజయనగరం అర్బన్: ఎన్నికలకు ముందు కూటమి నేతలు టీచర్ల సంక్షేమం కోసం పాటుపడతామంటూ హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీల అమలు విషయం దేవుడెరుగు... క్షేత్రస్థాయిలో సమస్యలు, డిమాండ్లను పరిష్కరించకుండా చుక్కలు చూపిస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులు, పాఠశాల వ్యవస్థ పునఃనిర్మాణ అంశాలపై ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలపై ఉపాధ్యాయ లోకం నిప్పులు చెరుగుతోంది. గత 30 వారాలుగా రాష్ట్రస్థాయిలో గర్తింపు పొందిన టీచర్ల సంఘాలతో సమావేశాలు నిర్వహించి డిమాండ్లను తెలుసుకున్నా పరిష్కరించకపోవడంపై ప్రశ్నిస్తున్నారు. జీఓ 19, 20, 21ను వ్యతిరేకిస్తున్నారు. డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 21న ఉమ్మడి విజయనగరం జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది.
ఉపాధ్యాయుల డిమాండ్ల ఇవే
● ఉన్నత పాఠశాలల్లో 1:30 నిష్పత్తి ప్రకారం 45 మంది విద్యార్థులు దాటిన తర్వాత సెక్షన్లు ఏర్పాటు చేయాలి.
● మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా స్కూల్ అసిస్టెంట్‌లను నియమించడం అశాసీ్త్రయం.
● బదిలీల్లో స్టడీ సెలవులో ఉన్న టీచర్ల స్థానాలను ఖాళీగా చూపరాదు.
● ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 41 వద్ద 3వ పోస్టు ఇవ్వాలి. ఏప్రిల్ 23వ తేదీ రోల్‌ను పరిగణనలోకి తీసుకోవాలి.
● బదిలీల ప్రక్రియలో కొన్ని ఖాళీ పోస్టులను బ్లాక్ చేస్తుండడం మానుకోవాలి.
● 2023లో రేషనలైజేషన్ చేసి అదే ఏడాదిలో ఉద్యోగోన్నతి పొంది 2025లో రేషనలైజేషన్ అవుతున్న టీచర్లకు బదిలీల్లో అన్యాయం జరుగుతోంది. అటువంటి వారికి బదిలీల్లో 8 సంవత్సరాల పాయింట్లు కేటాయించాలి.
● పీహెచ్‌సీ కోటా టీచర్లను రేషనలైజేషన్ చేయడం సరైన పద్ధతి కాదు.
● ప్రభుత్వ, పంచాయతీరాజ్ సర్వీస్ రూల్స్ సమస్య తేలకుండా 8 ఏళ్లుగా లాంగ్ స్టాండింగ్ అయిన టీచర్లను సొంత యాజమాన్యానికి వెళ్లమని చెప్పడం భావ్యం కాదు.
● ఎంఈఓలకు బదిలీలు నిర్వహించి కోరుకున్న ఎంఈఓ 1, ఎంఈఓ 2 లకు హెచ్‌ఎం కన్వెర్షన్ ఇవ్వాలి.
గరువులను మోసం చేస్తోన్న కూటమి ప్రభుత్వం
ఉద్యోగోన్నతులు, పాఠశాల విభజన
సమస్యలను పరిగణనలోకి తీసుకోని వైనం
21న ఉమ్మడి విజయనగరం జిల్లా డీఈఓ కార్యాలయం ముట్టడికి పిలుపు