
ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి
● ఇంచార్జ్ డీఆర్‌వో మురళి
విజయనగరం అర్బన్: ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చనని ఇంచార్జ్ డీఆర్‌వో మురళి అన్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తమ చాంబర్‌లో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఏడాది పొడవునా ఎప్పుడైనా ఫారం 6లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అదే విధంగా మార్పులు చేర్పుల కోసం ఫారం 8, తొలగింపుల కోసం ఫారం 7లో దరఖాస్తు చేయాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన పోలింగ్ బూత్ ఎక్కడైనా ఉంటే వాటిని తొలగించేందుకు ప్రతిపాదనలు పంపిస్తామని వాటి వివరాలను అందజేయాలని కోరారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1500 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే మరొక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తామని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 1200 ఓటర్లు పైబడిన కేంద్రాలు 138 వరకు ఉన్నాయని మురళి తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నుంచి శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ నుంచి కుటుంబరావు, బీజేసీ నుంచి అప్పారావు, కాంగ్రెస్ నుంచి సతీష్‌కుమార్, జనసేన నుంచి సతీష్, బీఎస్‌పీ నుంచి సోములు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.