‘కోట’లో కొత్త కుంపటి! | - | Sakshi
Sakshi News home page

‘కోట’లో కొత్త కుంపటి!

May 18 2025 1:01 AM | Updated on May 18 2025 1:01 AM

‘కోట’

‘కోట’లో కొత్త కుంపటి!

బొబ్బిలి: ప్రతిపక్ష కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి అడ్డదారిలో బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని హస్తగతం చేసుకునేందుకు బొబ్బిలి రాజులు ‘కోట’ వేదికగా చేస్తున్న కుటిలరాజకీయాలు బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయి. సీల్డ్‌ కవర్‌ రాజకీయాలొద్దని, తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పదవి ఇస్తేనే ఓటేస్తామని తెగేసి చెప్పినట్టు సమాచారం. ఇందులో భాగంగానే టీడీపీ కండువాలు వేసుకోవాలని నాయకులు బొబ్బిలి కోటలో శనివారం ఎంత ప్రలోభపెట్టినా తిరస్కరించారు. పదవిని అమ్ముకుందామని చూస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పినట్టు తెలిసింది. గత నెల29న టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు పదిమంది వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లకు డబ్బులు ఎర వేసి క్యాంపు నిర్వహించిన సంగతి తెల్సిందే! అవిశ్వాసం నెగ్గిన తరువాత సోమవారం చైర్మన్‌ ఎన్నికకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. ఈ ఎన్నిక నేపథ్యంలో బొబ్బిలి రాజకీయాలు వేడెక్కాయి. అవిశ్వాసం కోసం నోటీసు ఇచ్చిన సమయంలో మేం చైర్మన్‌ మార్పు కోసమే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులెత్తాం! అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అయితే మేం మద్దతు ఇస్తామని తేల్చి చెప్పారు. అయితే, అవిశ్వాసంలో టీడీపీకి సహకరించిన పది మంది కౌన్సిలర్లనూ టీడీపీ కండువాలు వేసుకునేందుకు బొబ్బిలి రాజులు కోటలోకి పిలిచారు. దీనికి ఇద్దరుముగ్గురు కౌన్సిలర్లు తలొగ్గి మాజీ మంత్రి సుజయ్‌, ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడుల సమక్షంలో కండువాలు వేసుకున్నట్టు తెలిసింది. మిగతావారు మేం కండువాలు వేసుకోం! ముందుగా చెప్పినట్టు ఫలానా వ్యక్తికి చైర్మన్‌ పదవి ఇస్తేనే కండువాలు వేసుకుంటాం అని భీష్మించుకు కూర్చున్నారు.

సాధారణ ఎన్నికల మాదిరి పైరవీలు..

రేసులో ఉన్న ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లు తమకు మద్దతు పలకాలని రెండు పార్టీలకు చెందిన వారిని సంపన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వ్యక్తిగతంగా కలవడం, ఫోన్లు చేసి ఎరవేయడం చేస్తున్నట్టు తెలిసింది. రూ.లక్షల్లో ఇస్తామని చెప్పడంతో పాటు చేతులెత్తాక ఇస్తామని చెబుతుండటంతో కౌన్సిలర్లు కూడా డైలమాలో పడి వెళ్దామా వద్దా అనే సంశయంలో ఉన్నారు. మరోవైపు చైర్మన్‌ పదవి ఎన్నికకు కేవలం కొద్ది గంటలు మాత్రమే సమయముండడంతో కౌన్సిలర్లు, టీడీపీ రాజకీయ నాయకులు, మరో పక్క చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న ఆ ఇద్దరు కూడా టెన్షన్‌లో పడ్డారు. గంటగంటకూ బేరాలు ఎలా వస్తున్నాయని కౌన్సిలర్లు ఆరా తీస్తుండడంతో ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు ప్రజలిచ్చిన కౌన్సిలర్‌ పదవులను అమ్మకానికి పెట్టడంపై సామాజిక మాధ్యమాలు, సామూహిక వేదికల్లో జనం దుయ్యబడుతున్నారు.

ఎందుకీ ట్విస్టు?:

టీడీపీ కౌన్సిలర్లతో చేతులు కలిపిన పది మంది కౌన్సిలర్లు ముందుగా అనుకున్నది కాపు సామాజిక వర్గానికి చెందిన 8వ వార్డు కౌన్సిలర్‌, పట్టణ టీడీపీ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌ను చైర్మన్‌ చేద్దామని. నిన్న మొన్నటి వరకూ శరత్‌పేరు వినిపించగా ఇప్పుడు మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌, పట్టణానికి చెందిన రాజకీయ నాయకులు, ఇతరులకు ఫైనాన్స్‌ చేసే సంపన్నుడు అయిన గెంబలి శ్రీనివాసరావు పేరు రేసులోకి వచ్చింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఇతను చైర్మన్‌ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఇందుకోసం భారీ మొత్తాన్ని ముట్ట జెబుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. శరత్‌ కోసం టీడీపీతో చేతులు కలిపిన కౌన్సిలర్లు ఈ తతంగాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే వారంతా కండువాల కార్యక్రమాన్ని బహిష్కరించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై వారు ముందుగానే రాజులతో ఇదేమిటిలా మారిందని అడిగితే.. అబ్బే అదేం లేదు! చైర్మన్‌ఎన్నిక అంతా అధిష్టానం ఇష్టం! అక్కడి నుంచి సీల్డ్‌ కవర్‌లో వచ్చిన పేరునే చైర్మన్‌గిరీకి ఎంపిక చేస్తామని సమాధానం ఇవ్వడంతో మీమాంసలో పడిపోయారంతా!. సీల్డ్‌ కవర్‌ రాజకీయాలొద్దు! ఎవర్ని చైర్మన్‌ చేస్తారో ఇప్పుడే చెప్పాలని పట్టుపట్టినట్టు భోగట్టా.

సీల్డ్‌ కవర్‌ రాజకీయాలొద్దని తెగేసి చెప్పిన కౌన్సిలర్లు

తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే చైర్మన్‌ పదవి ఇవ్వాలని పట్టు

అప్పటివరకు టీడీపీ కండువాలకు తిరస్కరణ

రసవత్తరంగా బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

‘కోట’లో కొత్త కుంపటి!1
1/1

‘కోట’లో కొత్త కుంపటి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement