
ఆండ్ర జలాశయం నీరు విడుదల
విజయనగరం: నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశాల మేరకు నీటిపారుదలశాఖ అధికారులు శనివారం ఆండ్ర జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. మరి కొద్దిరోజుల్లో మెంటాడ, పిట్టాడా, గజపతినగరం, రామతీర్థం మూల స్టేషన్ మీదుగా నెల్లిమర్లలోని చంపావతి నదిలోకి నీరు చేరనుంది. అక్కడ నుంచి ఇన్‌ఫిల్టరేషన్ ద్వారా నగరంలోని రిజర్వాయర్లకు పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం చంపావతి నీటి మట్టం తగ్గిపోవడంతో నగర ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చూసేందుకు విజయనగరం కార్పొరేషన్ చర్యలు చేపడుతోంది. వేసవిలో నీటి వృథాను అరికట్టాలని ప్రజలను అధికారులు కోరారు.
వ్యాయామంతో ఆరోగ్యం
● డీఎంహెచ్‌ఓ జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: ప్రతిరోజు వ్యాయమం చేయడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని డీఎంహెచ్‌ఓ ఎస్.జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైద్యులు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వేసి రక్తపోటును అదుపులో ఉంచుకోవాలన్నారు. ఆహార నియమాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎల్‌ఓ కె.రాణి, ఎన్‌సీడీ పీఓ సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ, డెమో వి.చిన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రిని అక్కడే కొనసాగిద్దామా..
విజయనగరం ఫోర్ట్: వియనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని వైద్య కళాశాలకు తరలించకుండా అక్కడే కొనసాగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నడుస్తున్న ఆస్పత్రి నగరం మధ్యలో ఉందని, అక్కడే కొనసాగించాలని పలువురు అభిప్రాయ పడుతున్నారన్నారు. జిజిహెచ్ భవనాల మాస్టర్ ప్లాన్ తీసుకొని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అంచానాలను తయారు చేయాలన్నారు. సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పి.అదితి విజయలక్ష్మి, కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు, ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ శివ శ్రీధర్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
పేలుడు పదార్థాలతో
వ్యక్తి అరెస్టు
విజయనగరం క్రైమ్: ఇంటిలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు పేలుడు పదార్థాలు కలిగి ఉన్న వ్యక్తిని విజయనగరం పోలీసులు అరెస్టుచేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం టు టౌన్ పరిధిలోని అబాద్ వీధికి చెందిన సీరజ్‌ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్ స్నేహితులు. వీరు పేలుడు పదార్థాలతో రెండు చోట్ల సంచరించినట్టు ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారు. పహల్గాం ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వీరి సంచారంపై నిఘాపెట్టారు. జిల్లా ఎస్పీకి సమాచారం అందించడంతో ఆయన ఆదేశాల మేరకు విజయనగరం డీఎస్పీ టుటౌన్ ఎస్‌ఐతో కలిసి శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విజయనగరంలోని అబాద్ వీధిలో ఉంటున్న సీరాజ్ ఉర్ రెహ్మన్ ఇంటిని సోదా చేశారు. ఆయన ఇంటిలో ఉన్న అమ్మోనియం సల్ఫర్, అల్యూమినియం పౌడర్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. విషయాన్ని రాష్ట్ర డీజీపీకి చేరవేయడంతో హైదరాబాద్‌లోని సమీర్‌ను సైతం అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్, అన్‌లాఫుల్ సస్పెన్షన్ యాక్టు అరెస్టుచేసి విజయనగరం కోర్టుకు తరలించగా 15 రోజులు రిమాండ్ విధించింది.

ఆండ్ర జలాశయం నీరు విడుదల

ఆండ్ర జలాశయం నీరు విడుదల