
మద్యం తాగి డ్రైవ్ చేస్తే రూ.10వేల జరిమానా
విజయనగరం క్రైమ్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను విజయనగరం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎంఎస్‌హెచ్‌ఆర్ తేజచక్రవర్తి విధించినట్టు ఎస్పీ వకుల్‌జిందల్ శనివారం తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 85 కేసులు నమోదు చేశారు. వారిని విజయనగరం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ తేజ చక్రవర్తి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున మొత్తం 85 మందికి రూ.8.50 లక్షల జరిమానా విధించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మద్యం మత్తులో చాలామంది వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావడం, ఇతర వాహనాలను ఢీ కొట్టి ప్రమాదాలకు కారకులవుతున్నారన్నారు. ఈ తరహా వాహనదారులను కట్టడి చేసేందుకు, ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రతిరోజూ విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్రంకన్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఒకే రోజు 85 డ్రంకన్‌డ్రైవ్ కేసుల్లో రూ.8.50 లక్షల
జరిమానా వసూలు