
డెంగీ నిర్మూలన సామాజిక బాధ్యత
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి
విజయనగరం ఫోర్ట్/విజయనగరం: డెంగీ వ్యాధి నిర్మూలన సామాజిక బాధ్యతగా గుర్తించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి పిలుపునిచ్చారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి గంటస్తంభం వరకు శుక్రవారం నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్బొవైరస్ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగీ వైరస్‌ల వల్ల ఈవ్యాధి వస్తుందన్నారు. ఇది మనిషి నుంచి మనిషికి ఏడిస్ ఈజిప్ట్ దోమలు కుట్టడం వల్ల సంక్రమిస్తుందని తెలిపారు. ఈ దోమలు ఇంటిలోపల, ఆవరణలో ఉంటాయని చెప్పారు. పగటి పూట కుడతాయని, ఎక్కువ దూరం 400 మీటర్లు ఎగరలేవన్నారు. ఈవైరస్ వల్ల ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా డెంగీ రావచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రాణి, డీఎంఓ మణి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక రేపు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న చెస్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలను ఈ నెల 18 నిర్వహించనున్నట్లు చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కేవీ జ్వాలాముఖి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18న ఉదయం 9 గంటలకు విజయనగరం జిల్లా కేంద్రంలో గల రింగ్ రోడ్డు ఫైర్ చెస్ స్కూల్లో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అండర్ 7, 9,11,13 వయస్సుల విభాగాల్లో బాల బాలికలతో పాటు, ఓపెన్ విభాగంలో పోటీలు జరుగుతాయని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 25 నుంచి రాజాంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అర్హత ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9703344488 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఎన్‌సీసీ బాలికల బెటాలియన్ శిక్షణ క్యాంప్ ప్రారంభం
విజయనగరం అర్బన్: గాజులరేగలోని సీతం కాలేజీలో ఎన్‌సీసీ 2(ఏ) వార్షిక శిక్షణ శిబిరం శుక్రవారం ప్రారంభమైంది. శిబిరాన్ని ప్రారంభించిన కమాండింగ్ ఆపీసర్ కల్నల్ గోపేంద్ర మాట్లాడుతూ పదిరోజులు నిర్వహిస్తున్న ఈ శిబిరంలో వసతి సౌకర్యాలు పక్కాగా ఉండాలని ఆదేశించారు. పరిశుభ్రతను కొనసాగించాలని భవిష్యత్తులో యువత ఉన్నత స్థాయికి చేరుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ కెప్టెన్ మీసాల సత్యవేణి, సుబేదార్ మేజర్ బోడ్లే, పరమేశ్వర్ సింగ్, అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్స్ లెఫ్టినెంట్ వరలక్ష్మి, వెంకటరత్నం, అమృత, సునీత, నాగమణి, తులసి, సంధ్య, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి హాజరైన 600 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పెందుర్తి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మంచినీటి పథకం వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేందుకు సిద్ధమయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని, అతడ్ని రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెందుర్తి మండలం జంగాలపాలెం వద్ద శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన బోని సత్యం(60)కు భార్య, కుమార్తె, అల్లుడితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి వీరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో చింతలపాలెనికి సమీపంలోని జంగాలపాలెంలో వాటర్ ట్యాంక్ ఎక్కి దూకడానికి సిద్ధమయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ కె.వి.సతీష్‌కుమార్ ఆదేశాలతో సమీపంలోనే ఉన్న బ్లూకోట్స్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ హుటాహుటిన అక్కడకు వెళ్లి, సత్యంను చాకచక్యంగా కిందికి దించేలా చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. బంధువులకు అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

డెంగీ నిర్మూలన సామాజిక బాధ్యత