
వీరఘట్టం: మండలంలోని గడగమ్మ గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారు అరసాడ ప్రసాదరావు(49) ఆటో బోల్తా పడడంతో జరిగిన ప్రమాదంలో శుక్రవారం మృతిచెందాడు. ఈ మేరకు ఉపాధి హామీ ఏపీఓ జి.సత్యంనాయుడు తెలిపిన వివరాల ప్రకారం గడగమ్మ గ్రామం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నగోర గ్రామంలోని ఆరుద్రమ్మ చెరువులో జరుగుతున్న ఉపాధి పనులకు గ్రామానికి చెందిన వేతనదారులు గడిచిన 7 వారాలుగా ఆటోలపై వెళ్తున్నారు. ఎప్పటిలాగానే శుక్రవారం కూడా వేతనదారులతోబయల్దేరిన ఆటోల్లో ఒక ఆటో అచ్చెపువలస గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలైన అరసాడ ప్రసాదరావును మెరుగైన వైద్య చికిత్స కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసాదరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.కళాధర్ తెలిపారు.
పిడుగుపాటుతో గిరిజన యువకుడు..
సీతంపేట: మండలంలోని దేవనాపురం సమీపంలో పిడుగుపాటుకు గురై ఓ గిరిజన యువకుడు శుక్రవారం మృతిచెందాడు. జేపీ బూర్జగూడకు చెందిన సవర చంద్రరావు(28) దేవనాపురం ప్రాంతంలో ఉన్న పొలంలో ట్రాక్టర్‌తో వేసవి దుక్కి దున్నించిన అనంతరం ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో పిడుగు ఒక్క ఉదుటన దగ్గరగా పడడంతో అక్కడికక్కడే మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు. మృతుడు అవివాహితుడు. తండ్రి జమ్మయ్య కొన్నేళ్ల కిందట మృతిచెందాడు. చంద్రరావు మృతివార్త విన్న తల్లి సొట్టమ్మ, సోదరుడు రమేష్‌లు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఎస్సై వై.అమ్మన్నరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.