
16 కేజీల గంజాయితో నలుగురి అరెస్ట్
కొత్తవలస: మండల కేంద్రంలో గల రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టగా 16 కేజీల గంజాయితో నలుగురు నిందితులు పట్టుబడినట్లు సీఐ షన్ముఖ రావు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ తెలిపిన మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం రాత్రి కొత్తవలస రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించగా ప్లాట్‌ఫామ్–1లో బ్యాగులతో నలుగురు వ్యక్తులు అనుమానాస్పందంగా తిరుగుతూ పోలీసులను చూసి కంగారు పడి పారిపోయేందుకు సిద్ధమవుతుండగా పట్టుకుని విచారణ చేసినట్లు తెలిపారు. వారి దగ్గర ఉన్న బ్యాగ్‌లను తెరిచి చూడగా పది గంజాయి ప్యాకెట్లలో 16 కేజీలు గంజాయి ఉన్నట్లు చెప్పారు. విజయవాడ ప్రాంతంలోని వాంబే కాలనీకి చెందిన జోజిబాబు, శామ్యూల్‌జాన్, మనికంఠ, మహేశ్వరరావులుగా నిందితులను గుర్తించామన్నారు. ఒడిశాలోని పాడువలో ఒక వ్యక్తి దగ్గర 16 కేజీల గంజాయిని నిందితులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని, నిందితులు అక్కడి నుంచి కిరండోల్ రైల్లో కొత్తవలస వరకు వచ్చి అక్కడి నుంచి ఆటోలో విశాఖపట్నం చేరుకుని రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లేందుకు ప్రణాళిక వేసుకున్నారన్నారు. ఇందులో భాగంగా కొత్తవలస రైల్వేస్టేషన్‌లో వేచి ఉన్న సమయంలో పట్టుబడినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి విజయనగరం జీఆర్‌పీ ఎస్సై బాలాజీకి గంజాయిని, నిందుతులను అప్పగించినట్లు సీఐ వివరించారు.