
కుక్కల దాడిలో పలువురికి గాయాలు
రాజాం సిటీ: కుక్కలు విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. శుక్రవారం పట్టణ పరిధిలోని కాలెపువీధికి చెందిన చిన్నారి గంపల లలిత ఇంటి ముందు ఆరుబయట ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కలు దాడిచేసి గాయపర్చాయి. వెంటనే స్థానికులు స్పందించి తీవ్రంగా గాయపడిన చిన్నారిని సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అలాగే మండల పరిధి మారేడుబాక గ్రామానికి చెందిన కోరాడ నారాయణమ్మ అనే వృద్ధురాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కుక్కలు దాడిచేసి గాయపర్చాయి. కుటుంబసభ్యులు రాజాం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పట్టణంతోపాటు మండలంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని పలుమార్లు అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు.
బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్రగాయాలు
రాజాం సిటీ: మండల పరిధి శ్రీకాకుళం రోడ్డులోని రెండో మైలు రాయివద్ద శుక్రవారం బైక్ అదుపు తప్పడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం న్యూకాలనీకి చెందిన కేవీఎస్ భక్తవత్సలం తీవ్రగాయాల పాలయ్యాడు. రాజాం నుంచి స్వగ్రామం శ్రీకాకుళం ద్విచక్రవాహనంపై ఆయన వెళ్తుండగా రెండో మైలు రాయి వద్దకు వచ్చేసరికి మోటార్‌సైకిల్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో భక్తవత్సలం తలకు తీవ్రగాయాలు కావడంతో 108కు సమాచారం అందించగా ఈఎంటీ ఆలుగుబిల్లి శ్రీనివాసరావు, పైలెట్ శంకరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకుకుళం తరలించారు.