
సీఎస్‌ఆర్ నిధులతో చెరువుల అభివృద్ధి
విజయనగరం అర్బన్: చంపావతి నదీ పరివాహక ప్రాంతంలో సీఎస్‌ఆర్ నిధులతో 40 చెరువుల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. యాక్సిస్ బ్యాంకు సీఎస్‌ఆర్ నిధులతో ధాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పనులు జరుగుతాయన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ధాన్ ఫౌండేషన్ ప్రతినిధులతో తన చాంబర్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. చంపావతి నదీ పరివాహక ప్రాంతాలైన నెల్లిమర్ల, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాల్లో 40 చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధికి ధాన్ పౌండేషన్ ముందుకు వచ్చిందని తెలిపారు. దీనికోసం ఐదేళ్లలో సుమారు రూ.15 కోట్ల వరకు ఖర్చుచేయనుందని వెల్లడించారు. ఈ ఏడాది అభివృద్ధి చేయబోయే చెరువులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఫౌండేషన్ ప్రతినిధులు అనిల్, లోకేష్, రాంకుమార్ తమ సంస్థ చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ఎంపిక చేసిన నాలుగు మండలాల పరిధిలో 235 గ్రామాలుండగా, చంపావతి నదీ పరివాహక ప్రాంతంలో 168 గ్రామాలు ఉన్నాయని, వీటిలో 40 గ్రామాలను ఎంపిక చేశామన్నారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, డ్వామా పీడీ శారదాదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, పీఆర్ ఎస్‌ఈ ఎం.శ్రీనివాసరావు, డీపీఓ టి.వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఎస్‌ఈ స్వర్ణకుమార్, మైనర్ ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్

సీఎస్‌ఆర్ నిధులతో చెరువుల అభివృద్ధి