
ని–క్షయ్ మిత్రలుగా ప్రభుత్వ ఉద్యోగుల నమోదు
పార్వతీపురంటౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ఐఎంఏ సభ్యులు, ఎన్‌జీఓలు ని–క్షయ్ మిత్రలుగా నమోదు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. 100 రోజుల ఇంటెన్సిఫైడ్ టీబీ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ బారిన పడిన వ్యక్తులను దత్తత తీసుకుని, వారికి అవసరమైన పోషకాహార మద్దతుతో పాటు మెరుగైన జీవనం కోసం స్వచ్ఛందంగా ప్రతి నెలా రూ.700లు చొప్పున ఆరు మాసాల పాటు ఇచ్చేందుకు యోచించాలని కోరారు. వీటితో పాటు ప్రభుత్వం ఉచితంగా అందించే మందులను రోగి క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా టీబీని పూర్తిగా అంతమొందించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 10 మంది వరకు ప్రభుత్వ వైద్యులు టీబీ బారిన పడిన వ్యక్తులను దత్తత తీసుకుని, వారికి పోషకాహార మద్దతును ఇస్తున్నారని, అదేవిధంగా మిగిలిన ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రధానమంత్రి క్షయ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా జిల్లాలో టీబీని పూర్తిగా అంతమొందించేందుకు 100 రోజుల ఇంటెన్సిఫైడ్ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందుకు స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని, టీబీ బారిన పడిన వ్యక్తులకు పోషకాహారం కోసం విరాళాలు అందించాలనుకున్న వారు జిల్లా లెప్రసీ ఎయిడ్స్, టీబీ అధికారి, ఖాతా నంబర్ 004012010003135, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ 0800406, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బెలగాం మెయిన్ రోడ్, పార్వతీపురం జిల్లా ఖాతాలో జమ చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇతర వివరాల కోసం ఫోన్ 80083 11511 నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కాన్ఫరెన్‌న్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్.భాస్కరరావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్ కుమార్, ఇతర వైద్యాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్