
పిడుగుపాటుకు ఎనిమిది గొర్రెల మృతి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని పెద్ద బూరాడపేట సమీపంలో సోమవారం మధ్యాహ్నం పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు గ్రామానికి చెందిన డొప్ప త్రినాఽథ్ అనే రైతుకు చెందిన ఎనిమిది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సమీప పొలాల్లో గొర్రెలు మేత మేస్తుండగా ఆకస్మాత్తుగా పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. గొర్రెలు మేత మేస్తున్న సమయంలో పిడుగు పడడంతో ఎనిమిది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ.80వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు త్రినాఽథ్ వాపోయాడు.
రైతును వెంటాడుతున్న దురదృష్టం
బూరాడపేటకు చెందిన రైతు డొప్ప త్రినాఽథ్‌ను దురదృష్టం వెంటాడుతోంది. సుమారు ఐదు నెలల క్రితం ఖరీఫ్ సీజన్‌లో కురిసిన వర్షానికి పొలంలో రాలిన ధాన్యం గింజలను మేయడంతో సుమారు 100కు పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ధాన్యాన్ని జీర్ణించుకోలేకపోవడంతో గొర్రెలు మృతి చెందాయి. అప్పట్లో సుమారు రూ.10లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. ఆ బాధ నుంచి తేరుకోకుండానే మళ్లీ పిడుగు రూపంలో ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. దీంతో బాధిత కుటుంబసభ్యులు తీవ్రంగా రోదించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు.