
మన క్రీడా విధానం దేశానికే ఆదర్శం
● చదువుతో పాటు ఆటలకూ ప్రాధాన్యత
● రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం: క్రీడా విధానంలో మనం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించామని, క్రీడల కోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని చెప్పారు. చదువుతో పాటు ఆటలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో జరుగుతున్న 3వ జాతీయ తైక్వాండో శిక్షణా సెమినార్‌కు మంత్రి శ్రీనివాస్ మంగళవారం హాజరయ్యారు. క్రీడాకారులకు ఇస్తున్న శిక్షణను తిలకించారు. ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోచ్‌లు, క్రీడాకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, మానవ వనరులే మన దేశానికి ఆస్తి అని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి చదువుతో పాటు, ఆటల్లో కూడా రాణించి మన రాష్ట్రానికి, ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో తైక్వాండో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.వేణుగోపాల్, అంతర్జాతీయ క్రీడాకారుడు, తైక్వాండో కోచ్ అబ్బాస్ షేకీ, తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి కె.శ్రీహరి, మక్కువ శ్రీధర్ తదితర ప్రముఖులు, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.