
స్థానిక సంస్థలు నిర్వీర్యం
● కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయి
● వైఎస్సార్‌సీపీ నాయకులపై
కేసులతో వేధింపులు
● స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు
● కొత్త పింఛన్ల మంజూరు
జీఓ ఏమైంది?
● రైతు భరోసా ఊసేలేదు, పంటకు గిట్టుబాటు ధరల్లేవు
● మద్యం విధానం అమలుపై టీడీపీ
ప్రజాప్రతినిధులే ఆరోపణలు
చేస్తున్నారు
● విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్
మజ్జి శ్రీనివాసరావు
గత వైఎస్సార్‌సీపీ పాలనలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసి సచివాలయ వ్యవస్థను తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోంది. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకుండా గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటోంది. నిధులు విడుదల చేస్తేనే తాగునీరు, పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు వీలుకలుగుతుందన్న విషయాన్ని గుర్తించాలి. ప్రజాప్రయోజనాలను పక్కనపెట్టి కూటమి నాయకులకు ప్రయోజనం చేకూర్చేలా ఉపాధిహామీ పనులు చేపడుతుండడం విచారకరం.
విజయనగరం:
జిల్లాలో చెరకు రైతుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలోని సంకిలి చక్కెర కర్మాగారంలో ఈ ఏడాది క్రషింగ్ జరుపుతారో, లేదో అన్న బెంగ రైతులను వెంటాడుతోందని, తక్షణమే దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి ఏడాది గడిచినా రైతుభరోసా పథకాన్ని అమలుచేయలేదని, పంటలకు గిట్టుబాటు ధర కల్పనలోనూ ప్రభుత్వం విఫల మైందని మండిపడ్డారు. పంటసాగుకు అవసరమైన వ్యవసాయ విద్యుత్‌కనెక్షన్లు మంజూరుచేయకపోవడం విచారకరమన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లోనే...
● శాంతి భద్రతలు క్షీణించాయి
ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడానికే సమయం వెచ్చిస్తున్నారు. మాజీ మంత్రి విడదల రజనిపట్ల పోలీసుల అనుచిత ప్రవర్తన ప్రభుత్వ వేధింపులకు నిదర్శనం. అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమినేతలు పూర్తిగా విస్మరించారు.
● మద్యం విధానంపై కూటమి
ప్రజాప్రతినిధులే విమర్శలు
ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానంపై ప్రజా ప్రతినిధులే విమర్శలు గుప్పించారు. దుకాణాల్లో చీప్‌లిక్కర్ అందుబాటులో ఉంటుందని, అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారని సమావేశంలో ప్రస్తావించారు. బెల్టు దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని మండిపడ్డారు. ప్రజా సమస్యలు, రైతు సమస్యలపై వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుంది. చెరకు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి.