
శాంతిభద్రతల పరిరక్షణే ప్రధానం
వంగర: శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. లక్ష్మీపేటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం పరిసరాలతో పాటు గ్రామంలోని అన్ని వీధుల్లోను సిబ్బందితో కలిసి మంగళవారం పర్యటించారు. పోలీస్ పికెట్ పాయింట్లు తనిఖీ చేశారు. 2012లో ఎస్సీ, బీసీల మధ్య జరిగిన ఘటనకు గల కారణాలు, గ్రామంలో పరిస్థితులు, న్యాయస్థానంలో కేసు విచారణ వంటి అంశాలను సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. బీసీ, ఎస్సీ వర్గాల మధ్య ఎటువంటి వివాదాలకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం వంగర పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు దిశానిర్దేశం చేశారు. లక్ష్మీపేట దళితులు, దళిత సంఘ నాయకుడు మజ్జి గణపతి ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిశారు. కేసు విచారణకు తమకు పూర్తి స్థాయి న్యాయవాదిని నియమించాలని కోరారు. ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తామని ఎస్పీ తెలిపారు. కోర్టులో విచారణకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావు, ఎస్సై షేక్ శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ వకుల్ జిందాల్