
ముగిసిన ఆహ్వాన నాటిక పోటీలు
● ఉత్తమ ప్రదర్శనగా
చీకటి పువ్వు నాటిక
● ద్వితీయ, తృతీయ ప్రదర్శనలుగా
కొత్త పరిమళం, రైతేరాజు
చీపురుపల్లిరూరల్(గరివిడి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు మూడు రోజుల పాటు వైభవంగా జరిగి ఆదివారం ముగిశాయి. గరివిడి కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో శ్రీరాం హైస్కూల్ ఆవరణంలో జరిగిన నాటిక పోటీల ప్రదర్శనలో..కరీంనగర్‌కు చెందిన చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ప్రదర్శించిన చీకటిపువ్వు నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. అదేవిధంగా బొరివంకకు చెందిన శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శించిన కొత్త పరిమళం నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నిలవగా హైదారాబాద్‌కు చెందిన కళాంజలి ఆధ్వర్యంలో ప్రదర్శించిన రైతేరాజు నాటిక తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది.
నగదు బహుమతుల అందజేత..
ఈ నాటికల ప్రదర్శనలో ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన చీకటిపువ్వు బృందానికి రూ.15వేలు, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన కొత్త పరిమళం నాటిక బృందానికి రూ.12,500, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన నాటిక బృందానికి రూ.10వేలు నగదు బహుమతిని నిర్వాహకులు అందజేశారు. అలాగే ప్రతి నాటిక ప్రదర్శనకు రూ.25వేలు ప్రోత్సాహంగా అందజేశారు. అదే విధంగా కొత్త పరిమళం రచయిత కేకే.ఎల్ స్వామికి రూ.5వేలు, చీకటిపువ్వు నాటిక దర్శకుడు రమేష్ మంచాలకు రూ.5వేల నగదు బహుమతిని కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు.

ముగిసిన ఆహ్వాన నాటిక పోటీలు