ఎండ ధాటికి వృద్ధులు త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరిగాయి. అయినప్పటికీ వృద్ధులు అప్రమత్తంగా ఉండడమే మేలని వైద్యులు చెబుతున్నారు.
హైపర్ థెర్మియా..
ఎండల్లో తిరగకుండా ఇంటిలో ఉన్నప్పటికీ అధిక ఉష్ణోగ్రతల వల్ల నీరసించిపోతారు. దీన్నే హైపర్‌థెర్మియా అంటారు. శరీరం స్వీకరించే దానికన్నా అధిక వేడిని తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.
హీట్ ఎగ్జాషెన్..
సాధారణంగా నాలుగు గంటలు ఎండల్లో తిరిగితే వడదెబ్బ సోకే అవకాశం ఉంటుంది. అయితే కొందరిలో ఒకటి రెండు గంటలు తిరిగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. దీన్నే హీట్ ఎగ్జాషెన్ అంటారు.
వడదెబ్బ..
ఎండల్లో పనిచేసే వారు, తిరిగే వారు వడదెబ్బకు గురవుతారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ సమయంలో ఆరుబయట పనులకు వెళ్లకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తే టోపీ ధరించడంతో పాటు వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి.
యూరినరీ ఇన్‌ఫెక్షన్లు..
వేసవిలో వృద్ధులు యూరినరీ ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. మహిళల్లో మెనోపాజ్ వల్ల హార్మోన్ల మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల.. పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంధి సమస్యతో యూరినరీ ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది.