
అరెస్టు చేసిన నలుగురు నిందితులతో ఎస్సై సురేంద్రనాయుడు
రామభద్రపురం: పాతకక్షల నేపథ్యంలో ఒక వ్యక్తిని హతమార్చేందుకు ప్రత్యర్ధులు పన్నిన కుట్రను పోలీసులు బట్టబయలు చేశారు. ఇటీవల మండలంలోని బూశాయవలస కోల్డ్ స్టోరేజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఇందులో భాగమేనని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సీఐ తిరుమలరావు మంగళవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. గతేడాది జూలై నెలలో మండలంలోని ఆరికతోటలో కూరాకుల కులానికి చెందిన వారు పాత కక్షలతో ఆ గ్రామంలో నడిరోడ్డుపై కత్తితో నరికి వర్రి చిన్నోడును హత్యచేశారు. హత్యకు పాల్పడిన నిందితులు కొద్ది రోజుల క్రితం బెయిల్‌పై వచ్చారు. హతుడి కుటుంబీకులు ప్రత్యర్థుల్లో ఎవరో ఒకరిని చంపాలని కక్షతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన హత్యానేరం కింద ఎ4గా ఉన్న కర్రి శంకరరావు మక్కువ మండలం కాశీపట్నం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అదే మండలంలోని బూశాయవలస కోల్డ్‌స్టోరేజీ వద్ద వ్యాన్‌తో ఢీకొట్టారు. దీంతో శంకరరాకు స్వల్ప గాయాలయ్యాయి. వ్యాన్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన శంకరరావును ప్రధమ చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించి,వ్యాన్ స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తప్పుడు చిరునామాతో వ్యాన్ కొనుగోలు
వ్యాన్ డ్రైవర్ గోపాల్ దొరకకపోవడంతో అనుమానం వచ్చి వ్యాన్ గురించి విచారణ చేపట్టి ఆరికతోట గ్రామానికి చెందిన వర్రి శివుడు, మామిడి రాము, వర్రి గౌరీస్‌లు సాలూరు మండలంలోని లక్కుడువలస గ్రామం పేరు చెప్పి తప్పుడు అడ్రస్‌తో వ్యాన్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ చేయగా ప్రణాళిక ప్రకారం వ్యాన్‌తో శంకరరావును ఢీకొట్టి హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆలోచన చేశామని, అందుకే వ్యాన్ కొనుగోలు చేసి డ్రైవర్‌ను నియమించామని అంగీకరించారు. అలాగే పోలీసులు కూడా ఫోన్‌కాల్స్ ఆధారంగా నిందితులు నలుగురిని గుర్తించి అరెస్టు చేసి సాలూరు కోర్టులో హాజరపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
నలుగురు నిందితుల అరెస్ట్