
త్వరలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాలో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణులయ్యేలా జిల్లా విద్యా శాఖ పక్కా ప్రణాళిక రచించి అమలు చేసింది. మరో వారం రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడంలో విద్యా శాఖ పూర్తిగా తలమునకలైంది. అదే సమయంలో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టింది.
● పదో తరగతిలో మంచి ఫలితాల కోసం జిల్లా విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక ● 436 పాఠశాలల్లో 24,714 మంది విద్యార్థులకు ప్రయోజనం ● సందేహాల నివృత్తికి 127 సెంటర్లు ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
సెల్ఫ్ ఎవల్యూషన్ లెర్నింగ్ ఫర్ ఫ్యూచర్... ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు జిల్లా విద్యా శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఇది. రానున్న పబ్లిక్ పరీక్షలో శత శాతం ఉత్తీర్ణతే దీని ఏకై క లక్ష్యం. అంతేకాదు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా అంతకన్నా ఉత్తమంగా నిలవాలనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఆ దిశగా దృష్టి సారించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో 436 ప్రభుత్వ పాఠశా లల్లోని 24,714 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. గత ఏడాది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ల్లో ఒక ప్రయోగం చేశారు. సూపర్ సిక్స్ పేరుతో విద్యార్థులను బ్యాచ్‌లుగా ఏర్పాటు చేశారు. వారికి ఎప్పటికప్పుడు మాదిరి పరీక్షలు నిర్వహించారు. తప్పులు సరిదిద్దడమే కాకుండా పరీక్షల పట్ల వారికున్న సందేహాలను నివృత్తి చేస్తూ భయాందోళనల ను పోగొట్టారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చింది. పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు వచ్చాయి. అదే స్ఫూర్తితో జిల్లా విద్యాశాఖ ఈ ఏడాది సెల్ఫ్ ఎవల్యూషన్ లెర్నింగ్ ఫర్ ఫ్యూచర్ పేరుతో ఒక ప్రణాళికను రూపొందించింది. సూపర్ ఫార్టీ పేరు తో కేజీబీవీల సహా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 40 మంది చొప్పున విద్యార్థులను బ్యాచ్‌లుగా చేశారు. గత డిసెంబరు నుంచే గ్రాండ్ టెస్ట్‌లను నిర్వహించా రు. ఫిబ్రవరి నెలలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా పెట్టారు. వీటన్నింటిలోనూ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఇదే ఉత్సాహంతో మరికొద్ది రోజుల్లో అసలైన పబ్లిక్ పరీక్షలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
పరీక్షల కోసం సిలబస్‌ను పూర్తి చేయడం ఒక ఎత్తు అయితే అనవసరమైన భయాందోళనలు తొలగించడం మరో ఎత్తు. గ్రాండ్ టెస్టులతో పాటు ఇప్పటివరకూ వివిధ దశల్లో నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. కాస్త వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం ఒక్కొక్కరి బాధ్యతలు ఒక్కో టీచర్‌కు అప్పగించారు. ఆ విద్యార్థికి సంబంధించిన సానుకూల, ప్రతికూల అంశాలను గమనించి వారు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చేలా చూడటమే వారి బాధ్యత. అందుకు ఆయా విద్యార్థి తల్లిదండ్రుల సహకారం కూడా తీసుకుంటున్నారు. ఏ దశలోనూ వారిలో నైరాశ్యం నెలకొనకుండా ఒక ఉత్సాహంతో పరీక్షలకు హాజరయ్యేలా వారిని తీర్చిదిద్దుతున్నారు.
127 పరీక్ష కేంద్రాలు
ఏప్రిల్ 3వ తేదీ నుంచి జిల్లాలో మొత్తం 127 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పరీక్షలకు అంతా సిద్ధం
ప్రణాళిక ప్రకారం పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడం కోసం కృషి చేస్తున్నాం. ఉపాధ్యాయులు ఆ దిశగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం.
– బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి, విజయనగరం

