
ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న శిశువులు
● ప్రాణాపాయ స్థితిలో శిశువులకు ఊపిరి పోస్తున్న ఎస్‌ఎన్‌సీయూ ● నెల రోజులలోపు పిల్లలకు ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స ● నెలకు 600 నుంచి 700 మంది శిశువులకు చికిత్స
శిశువులు అనారోగ్యానికి కారణాలు...
●గర్భిణుల్లో రక్తహీనత
●బాల్య వివాహాలు
●వివిధ రకాల ఇన్‌ఫెక్షన్స్
●నెలలు నిండకుండా పుట్టడం తదితర కారణాలు వల్ల శిశువులు అనారోగ్యానికి గురవ్వడం. బరువు తక్కువుగా పుడుతున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న శిశువులకు అక్కడ ఊపిరి పోస్తున్నారు. ఇలా చికిత్స పొందుతున్న శిశువుల సంఖ్య నెలకు కనీసం 600 వరకు ఉంటుంది. అదే నవజాత శిశువుల విభాగం
(ఎస్‌ఎన్‌సీయూ).
విజయనగరం ఫోర్ట్:
పట్టణంలోని ఘోషాస్పత్రిలో ఉన్న నవజాత శిశువుల విభాగానికి (ఎస్‌ఎన్‌సీయూ) వచ్చే వారంతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారే. బాహ్య ప్రపంచం చూడకుండానే అనారోగ్యానికి గురైన నవజాత శిశువులు అక్కడ చికిత్స కోసం వస్తారు. తక్కువ బరువుతో పుట్టిన వారు, నెలలు నిండకుండానే పుట్టినవారు, పుట్టిన తరువాత శ్వాస అందని వారు, వివిధ రకాల ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారు ఇక్కడ చికిత్స కోసం చేరుతారు. ఇలా ప్రాణాపాయ స్థితిలో చేరిన వారందరిని పూర్తి ఆరోగ్యవంతులుగా చేసి ఇంటికి పంపిస్తున్నారు. అదే నవజాతి శిశువుల విభాగం. అనారోగ్య శిశువులను ఆరోగ్యవంతుగా చేసే చికిత్సాలయంగా పేరుగాంచింది. పట్టణంలోని ఘోషాస్పత్రిలో ఎస్‌ఎన్‌సీయూ విభాగం ఉంది. దీనికి 20 పడక లు కేటాయించారు. ఘోషాస్పత్రిలో పుట్టిన శిశువులతో పాటు సీహెచ్‌సీ, ప్రాంతీయ ఆస్పత్రుల నుంచి కూడా మెరుగైన చికిత్స కోసం ఇక్కడకు వస్తారు. ఎంతో ఖరీదైన వైద్యం ఉచితంగా లభిస్తుండడంతో అధిక సంఖ్యలో రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందే రోగులకు అక్కడ వైద్య సిబ్బంది కూడా ప్రేమతో వైద్య సేవలు అంది స్తూ మన్ననలు పొందుతున్నారు.
అన్ని పరికరాలు అందుబాటులో..
నవజాత శిశువుల విభాగంలో శిశువులకు వైద్యం అందించడానికి అవసరమైన పరికరాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఫొటోథెరిపి, వెంటిలేటర్, సీపీఆఫ్, వార్మర్లు, పల్స్ ఆక్సీమీటర్లు అందుబాటు లో ఉన్నాయి. ఫొటో థెరిపి పరికరంలో పచ్చ కామె ర్లు ఉన్న వారికి వైద్యం అందిస్తారు. వార్మర్స్‌లో శిశువులకు వెచ్చదనం కోసం ఉపయోగిస్తారు. పల్స్ ఆక్సీమీటర్ శిశువుల పల్స్ ఎంతో ఉందో చూస్తారు. సీపీఆఫ్ మిషను ద్వారా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్న వారికి చికిత్స అందిస్తారు. వెంటిలేటర్ ద్వారా ఊపిరి తీసుకోలేని వారికి చికిత్స అందిస్తారు.
తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు ఎక్కువ
ఎస్‌ఎన్‌సీయూలో బరువు తక్కువతో పుట్టిన పిల్లల కు ఎక్కువగా చికిత్స కోసం చేరుతున్నారు. ఇక్కడ బరువు తక్కువుగా ఉన్న శిశువులు 40 శాతం మంది, నెలలు నిండకుండా పుట్టిన శిశువులు 35 శాతం మంది, 25 శాతం మంది ఇన్‌ఫెక్షన్స్, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడిన వారు చేరుతున్నారు. ఇన్‌పే షేంట్లుగా నెలకు 300 మంది వరకు, ఔట్ పేషేంట్ సేవలు 400 మంది వరకు పొందుతున్నారు.
ఆరోగ్యకరమైన శిశువుల కోసం...
మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.
రక్తహీనత లేకుండా చేసుకోవాలి.
కిషోర బాలిక దశ నుంచి రక్తహీనత లేకుండా చూసుకోవాలి.
తల్లులు బరువు తక్కువ లేకుండా చూసుకోవాలి.
బాల్య వివాహాలు చేసుకోకూడదు.
మూత్ర ఇన్‌ఫెక్షన్స్‌కు సరైన చికిత్స చేయించుకోవాలి.
సకాలంలో వైద్య తనిఖీలు చేయించుకోవాలి.
టీకాలు క్రమం తప్పకుండా వేసుకోవాలి.
85 శాతం రికవరీ
తీవ్ర అనారోగ్యం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న శిశువులు ఇక్కడ చికిత్స కోసం చేరుతారు. వారందరికి మెరుగైన వైద్య సేవలు అందించి పూర్తి ఆరోగ్యవంతులైన తర్వాత ఇంటికి పంపిస్తాం. డిశ్చార్జ్ అయిన తర్వాత ఏడాది వరకు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ సేవలు అందిస్తున్నాం. 85 శాతం రికవరీ రేటు ఉంది.
– డాక్టర్ శాంతి, ఎస్‌ఎన్‌సీయూ, వైద్యాధికారి

పచ్చకామెర్లు వచ్చిన శిశువులకు ఫొటో థెరిపిలో చికిత్స

శిశువుకు చికిత్స అందిస్తున్న వైద్యురాలు
