ఆరిలోవ (విశాఖపట్నం జిల్లా) : ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. సరదాగా గడపడానికి వెళ్లిన స్నేహితుల మధ్య జరిగిన గొడవ, దాడి కారణంగా మనస్తాపం చెందిన ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. లా అండ్ ఆర్డర్ ఎస్‌ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.జోడుగుళ్లపాలేనికి చెందిన ఆకుమర్తి శాంతి (27)కి నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన వాసుపల్లి సాయికిరణ్, పుచ్చ సాయికిరణ్, రంప లక్ష్మీ సౌజన్య సంజన, జి.జస్వంత్, నరవ సాయికుమార్, మణి స్నేహితులు. వీరంతా సోషల్ మీడియా ద్వారా కొంతకాలం కిందట పరిచయమయ్యారు.
సరదాగా గడపడానికి వీరంతా కలిసి మంగళవారం జోడుగుళ్లపాలెం వద్ద బీచ్ రోడ్డులో ఉన్న ఒక లాడ్జిలో 118, 119 నంబర్ గదులను తీసుకున్నారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించిన అనంతరం, వారి మధ్య ఏదో విషయంలో చిన్నపాటి వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో పుచ్చ సాయికిరణ్, లక్ష్మీ సౌజన్య, జస్వంత్ కలిసి శాంతిని కొట్టారు. అనంతరం వారంతా కలిసి 119 గదిలోకి వెళ్లిపోగా, శాంతి ఒంటరిగా 118 గదిలోనే ఉండిపోయింది. స్నేహితులు తనను కొట్టడాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆమె, గదికి లోపల గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.
కొంతసేపటి తర్వాత స్నేహితులు వచ్చి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో, వారు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న శాంతిని గమనించి వెంటనే కిందకు దించి మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మంగళవారం రాత్రి శాంతి తల్లి ఆకుమర్తి రమ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆరుగురు స్నేహితులపై కేసు నమోదు చేసి, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.


