ఉపాధికి లంగరు | - | Sakshi
Sakshi News home page

ఉపాధికి లంగరు

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

మహారాణిపేట: సముద్ర మత్స్య సంపద వృద్ధి, పునరుత్పత్తి లక్ష్యంగా తూర్పు సముద్ర తీరంలో ఏటా అమలు చేసే ‘వేట నిషేధం’ మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. బుధవారం నుంచి జూన్‌ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు ఈ నిషేధ కాలం అమలులో ఉంటుంది. దీనివల్ల విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 749 మరపడవలు, 1310 మోటారు బోట్లు ఇప్పటికే తీరానికి చేరుకుని లంగరు వేశాయి. ట్రాలర్లు, మోటార్‌ బోట్లు, వాహన నౌకలు వంటి వాణిజ్య వేట నౌకలకు నిషేధం వర్తిస్తుండగా, మోటారు లేని సంప్రదాయ తెప్పలు, నాటు పడవలకు కొంత మినహాయింపు ఇచ్చారు. ఇవి తీరానికి 8 కిలోమీటర్ల లోపే వేట కొనసాగించవచ్చు.

మత్స్యకారులకు రెండు నెలల విరామం

పది నెలల పాటు నిరంతరంగా వేటలో నిమగ్నమయ్యే మత్స్యకారులకు ఈ 61 రోజుల నిషేధ కాలం విశ్రాంతిని కలిగిస్తుంది. మళ్లీ జూన్‌ 15 నుంచి వేట కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. విశాఖ జిల్లాలో 65 కిలోమీటర్ల తీరరేఖ, 32 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో 749 మరబోట్లు, 1310 మోటారు బోట్లు, 488 సంప్రదాయ తెప్పలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని బోట్లు ఒడ్డుకు చేరుకున్నాయని మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పి.లక్ష్మణరావు తెలిపారు. మత్స్య సంపద పరిరక్షణ కోసం ఈ నిషేధాన్ని మత్స్యకారులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

సీజన్‌ కన్నా ముందే బోట్లు నిలిపివేత

ఈ ఏడాది అనేక సమస్యల కారణంగా మత్స్యకారులు సీజన్‌కన్నా ముందుగానే వేటను నిలిపివేశారు. ఆయిల్‌ సబ్సిడీ సక్రమంగా అందకపోవడం, ఖర్చులు పెరగడం, చేపలకు గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాల వల్ల వేటలో నష్టాలు ఎదురయ్యాయి. దీంతో చాలా మంది బోటు యజమానులు ముందుగానే హార్బర్‌లో బోట్లు నిలిపివేశారు. అయితే చిన్న సంప్రదాయ పడవలతో రోజువారీ వేట మాత్రం కొనసాగుతోంది.

మరమ్మతులకు సమయం

వేట నిషేధ కాలంలో బోటు యజమానులు తమ నౌకలకు మరమ్మతులు చేపడతారు. ఇంజిన్‌, గేర్‌బాక్స్‌, వలలు, ఇతర పరికరాలను సరిచేసి తదుపరి సీజన్‌కు సిద్ధం చేసుకుంటారు. వేలాది మంది మత్స్యకార కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఇతర పనుల బాట పడుతున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిషేధ కాలంలో చేపల వేట కొనసాగిస్తే పట్టుబడిన చేపలను స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మత్స్యశాఖ, కోస్టల్‌ గార్డ్‌, కోస్టల్‌ సెక్యూరిటీ, పోలీస్‌, నేవీ, రెవెన్యూ విభాగాల సంయుక్త గస్తీ కొనసాగనుంది. మత్స్య సంపద పరిరక్షణ కోసం విధించిన నిషేధాన్ని మత్స్యకారులు తప్పనిసరిగా పాటించాలి.

–పి.లక్ష్మణరావు, జాయింట్‌ డైరెక్టర్‌, మత్స్యశాఖ, విశాఖపట్నం

Advertisement
 
Advertisement
Advertisement