డివైడర్‌పైకి దూసుకెళ్లిన ట్రాలర్‌ | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌పైకి దూసుకెళ్లిన ట్రాలర్‌

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

తప్పిన భారీ ప్రమాదం

గాజువాక : నాతయ్యపాలెం వద్ద జాతీయ రహదారిపై ట్రాలర్‌ బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న బస్సును అతివేగంతో తప్పించబోయిన ట్రాలర్‌ డివైడర్‌పైకి దూసుకెళ్లి స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాకవరపాలెం నుంచి మెటీరియల్‌ లోడ్‌తో పోర్టు రోడ్‌లో ఉన్న గోడౌన్‌కు షీలానగర్‌ మీదుగా వెళ్లాల్సిన ట్రాలర్‌ సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నాతయ్యపాలెం జంక్షన్‌కు వచ్చింది. జంక్షన్‌లో ఆగి ఉన్న స్కూల్‌ బస్సును తప్పించబోయిన డ్రైవర్‌ షణ్ముఖరావు అతివేగం వల్ల ట్రాలర్‌ను అదుపు చేయలేక డివైడర్‌ను ఢీకొట్టాడు. అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో దాని క్యాబిన్‌తోపాటు వెనుక భాగం కూడా కొంత డివైడర్‌పైకి ఎక్కింది. డివైడర్‌పై ఉన్న ఇనుప గ్రిల్స్‌ను, విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ క్యాబిన్‌ ఎదరభాగం ధ్వంసం కాగా, డ్రైవర్‌ షణ్ముఖరావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కాగా, డ్రైవర్‌ చాకచక్యంగా బస్సును తప్పించి డివైడర్‌ను ఢీకొట్టడం వల్లే పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ ఏమాత్రం బస్సును ఢీకొట్టినా బస్సులో ఉన్నవారితోపాటు సమీపంలోని బస్టాప్‌లో ఉన్న ప్రయాణికులు కూడా ప్రమాదానికి గురయ్యేవారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంతో గాజువాక నుంచి షీలానగర్‌వైపు వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పండింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement