మావిగన్‌కే ప్రజా మద్దతు | - | Sakshi
Sakshi News home page

మావిగన్‌కే ప్రజా మద్దతు

Apr 14 2026 8:46 AM | Updated on Apr 14 2026 8:46 AM

● చంద్రబాబు కలల రాజధాని అమరావతి ‘కల’గానే మిగలనుంది ● వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షుడు జాన్‌ వెస్లీ

మహారాణిపేట: రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ. 2 లక్షల కోట్లతో నిర్మించే అమరావతి కన్నా, రూ. 2 వేల కోట్లతో అభివృద్ధి చేసే ‘మావిగన్‌’ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) కారిడార్‌ రాజధానిగా ఎంతో ఉత్తమమని వైఎస్సార్‌ సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌ వెస్లీ పేర్కొన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు కలల రాజధాని అమరావతి కేవలం ఒక మున్సిపాలిటీగానే మిగిలిపోతుందని, అది ప్రజలకు అందుబాటులో ఉండదని విమర్శించారు. గతంలో కాంట్రాక్టులు తీసుకున్న తన సన్నిహితులకు, బినామీ కంపెనీలకు మళ్లీ అధిక ధరలకు టెండర్లు కట్టబెడుతున్నారని, ఇది పెద్ద స్కామ్‌ అని ఆరోపించారు. ఒక్కో చదరపు అడుగుకి రూ.14 వేల వరకు కాంట్రాక్టర్లకు చెల్లించడం దారుణమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతూనే, కేవలం ప్రాథమిక మౌలిక సదుపాయాల కోసమే రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయడం అవివేకమని మండిపడ్డారు. ‘మావిగన్‌’ను బ్రౌన్‌ ఫీల్డ్‌ రాజధానిగా అభివృద్ధి చేస్తే తక్కువ ఖర్చుతో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని.. మేధావులు, ఆర్థికవేత్తలు సైతం దీన్నే సమర్థిస్తున్నారని తెలిపారు. అమరావతి వరదలు, ప్రకృతి విపత్తులకు గురయ్యే ప్రాంతమని గతంలోనే శివరామకృష్ణ కమిషన్‌ హెచ్చరించిందని ఆయన గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement