పేదల ఆరోగ్యం అంటే లెక్కలేదా..
మహారాణిపేట : కేజీహెచ్‌లో 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ మండిపడ్డారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ టెక్నాలజీకి నేనే ఆద్యుడని.. వీధిలైట్లు వెలగకపోయినా తనకు తెలిసిపోతుందని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. కేజీహెచ్‌లో 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిల్చిపోతే తెలియలేదా? మీ టెక్నాలజీ ఎక్కడికి పోయింది? అని ఎద్దేవా చేశారు. ఉదయం 12 గంటలకు విద్యుత్ సరఫరా నిల్చిపోతే కలెక్టర్ సహా ఒక్క ఉన్నతాధికారి కూడా పర్యవేక్షించకపోవడం దారుణమన్నారు. రాజేంద్రప్రసాద్ వార్డు, భావనగర్ వార్డులో ఉన్న రోగులు, చిన్నపిల్లల విభాగంలో చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు. అతిపెద్ద ఆసుపత్రిలో లక్ష రూపాయలు ఖర్చు చేసి జనరేటర్లు ఏర్పాటు చేయలేని దయనీయ స్థితిలో ఉందా? ఈ ప్రభుత్వమని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చుతో హెలికాప్టర్లలో చక్కెర్లు కొట్టే సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ పేద రోగుల కోసం జనరేటర్లు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. పేదల ఆరోగ్యం అంటే లెక్క లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దేవి మృతి
కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దేవి అనే ఓ మహిళ చనిపోగా పెద్ద సంఖ్యలో రోగులు విద్యుత్ అంతరాయంతో నరకయాతన అనుభవించారని రాజీవ్ అన్నారు. ఇంత మంది పేద రోగులను ఇబ్బందులు పాల్జేసిన కూటమి ప్రభుత్వానికి వారి ఉసురు తగలక మానదన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తీసుకువస్తే... చంద్రబాబు పాలనలో పేదలకు కనీస వైద్యం కూడా అందించలేని స్థాయికి దిగజార్చారని ఆక్షేపించారు.
తాగునీరివ్వలేని అసమర్థ పాలన
కురుపాంలోని గురుకుల పాఠశాల విద్యార్థినులకు తాగునీరు సరిగా అందించకపోవడంతోనే పెద్ద సంఖ్యలో బాలికలు కామెర్ల బారిన పడ్డారన్నారు. ఈ రాష్ట్రంలో ఆరోగ్యశాఖ అనారోగ్య శాఖగా మారిపోయింది. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ నోరిప్పితే పచ్చి అబద్దాలు చెబుతూ అసత్యకుమార్‌గా మారిపోయారు. కాశీబుగ్గలో భక్తులు చనిపోతే అది ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకున్న కూటమి ప్రభుత్వం.. ఇవాళ కేజీహెచ్ ఎవరి ఆధీనంలో ఉందో సమాధానం చెప్పాలన్నారు. ముమ్మూటికీ ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు. చంద్రబాబుది టార్చ్ లైట్ పాలన.. వైఎస్ జగన్‌ది ప్రపంచం మెచ్చిన టార్చ్ బేరర్ పాలన అన్నది ప్రజలందరికీ తెలుసు అన్నారు.


