పట్టాలు తప్పిన యశ్వంత్‌పూర్
బోగీ నుంచి క్షతగాత్రులను
బయటకు తీస్తున్న సిబ్బంది
గోపాలపట్నం: సింహాచలం రైల్వే స్టేషన్ పరిసరాలు శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. యశ్వంత్‌పూర్–సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోగీలు పట్టాలు తప్పి, చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు, గాయపడిన వారి హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే.. ఆ ప్రాంతమంతా అంబులెన్స్ సైరన్లు, అప్రమత్తం చేసే హెచ్చరికలతో మార్మోగిపోయింది. రక్తమోడుతున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు, వారికి అత్యవసర వైద్యం అందించేందుకు ప్రత్యేక శిబిరాలు వెలిశాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, రైల్వే మెకానికల్, ఆర్‌పీఎఫ్, మెడికల్ బృందాలు సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాయి. ఇదంతా చూసి నిజమైన ప్రమాదం జరిగిందని భయకంపితులైన ప్రజలు.. కాసేపటికి అసలు విషయం తెలిసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
సహాయక చర్యలు పర్యవేక్షించిన డీఆర్‌ఎం
అవును.. రైల్వే అధికారులు ఏటా నిర్వహించే మాక్‌డ్రిల్‌లో భాగంగానే ఈ ప్రమాదాన్ని సృష్టించారు. ప్రమాదాలు జరిగినప్పుడు వివిధ విభాగాలు ఎంత వేగంగా సమన్వయం చేసుకుని స్పందిస్తాయో పరీక్షించేందుకు జరిగిన ఈ కసరత్తు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఈ మాక్ డ్రిల్‌ను వాల్తేర్ డివిజన్ డీఆర్‌ఎం లలిత్ బొహ్రా స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల సమయంలో మన లోటుపాట్లు తెలుసుకుని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు మాక్‌డ్రిల్స్ నిర్వహిస్తుంటామని తెలిపారు. ఈ డ్రిల్‌లో అండర్ వాటర్ కటింగ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నదులు, బ్రిడ్జి లపై ప్రమాదాలు జరిగి బోగీలు నీటిలో పడిపోయినప్పుడు, ప్రయాణికులను కాపాడేందుకు నీటి లోపల కూడా మెటల్ బోగీలను ఎలా సురక్షితంగా కత్తిరించవచ్చో సిబ్బంది చూపించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ ఉత్కంఠభరిత ఆపరేషన్ సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగింది. మాక్‌డ్రిల్‌లో గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు, పలు విభాగాల రైల్వే అధికారులు పాల్గొన్నారు.
పట్టాలు తప్పిన యశ్వంత్‌పూర్
పట్టాలు తప్పిన యశ్వంత్‌పూర్
పట్టాలు తప్పిన యశ్వంత్‌పూర్
పట్టాలు తప్పిన యశ్వంత్‌పూర్
పట్టాలు తప్పిన యశ్వంత్‌పూర్


