నేటి నుంచి రంజీ సమరం
విశాఖ స్పోర్ట్స్: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–ఏ లో భాగంగా ఆంధ్ర జట్టు సొంత గడ్డపై తమిళనాడుతో తలపడనుంది. నగరంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శనివారం నుంచి ఈ నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆట ప్రారంభమై, రెండు సెషన్ల అనంతరం సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఎలైట్ గ్రూప్–ఏలో 8 జట్లు పోటీ పడుతుండగా, ఇప్పటికే అన్ని జట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడాయి. ఆంధ్ర జట్టు 9 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో ఒడిశాపై ఇన్నింగ్స్ విజయంతో ఆంధ్ర ఉత్సాహంగా బరిలోకి దిగుతుండగా, తమిళనాడు జట్టు 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం 15 పాయింట్లతో జార్ఖండ్ అగ్రస్థానంలో ఉండగా, 13 పాయింట్లతో విదర్భ రెండో స్థానంలో ఉంది. ఆంధ్ర జట్టు నాకౌట్ దశకు చేరుకోవాలంటే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవాల్సి ఉంటుంది. రాబోయే మ్యాచ్‌ల్లో ఆంధ్ర.. తమ కంటే పైన ఉన్న జార్ఖండ్, విదర్భ జట్లతోనే ఆడాల్సి ఉండటం గమనార్హం.
రాణిస్తున్న భరత్ : ప్రస్తుత సీజన్‌లో ఆంధ్ర జట్టుకు విశాఖకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విశాఖకు చెందిన రికీ బుయ్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, ఆశిష్ స్టాండ్–బైగా ఉన్నాడు. కె.ఎస్.భరత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. యూపీతో జరిగిన మ్యాచ్‌లో 142 పరుగులు, ఒడిశాపై 93 పరుగులు చేశాడు. వికెట్ కీపింగ్‌లోనూ రాణిస్తూ ఒడిశాతో మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు పట్టాడు. అయితే రికీ బుయ్ బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడు. ఒడిశాపై డకౌట్ కాగా, బరోడాపై 7, యూపీపై 2 పరుగులే చేశాడు. యూపీపై మాత్రం రెండు వికెట్లు తీశాడు. శశికాంత్ ఒడిశాపై 46 పరుగులతో పాటు ఒక వికెట్ తీశాడు. బరోడా, యూపీలపై కూడా తలో వికెట్ సాధించాడు. షేక్ రషీద్ టాపార్డర్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒడిశాపై 140 సాధించి అజేయంగా నిలిచాడు. యూపీపై 136 పరుగులు చేశాడు. ఓపెనర్ అభిషేక్ మూడు ఇన్నింగ్స్‌లలో 127 పరుగులు చేశాడు. త్రిపురాన విజయ్ రెండు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు, సాయితేజ 8 వికెట్లు పడగొట్టారు. ఈ రంజీ మ్యాచ్‌ను వీక్షించే అభిమానుల కోసం ఏసీఏ ఉచిత ప్రవేశం కల్పిస్తోంది. గేట్ నంబర్ 15 నుంచి ప్రవేశించి, ఎం స్టాండ్‌లో కూర్చుని మ్యాచ్‌ను వీక్షించవచ్చు.
కోచ్ స్టీవ్‌తో రికీబుయ్, తమిళనాడు కెప్టెన్ జగదీషన్‌తో ఆంధ్ర క్రికెటర్
నేటి నుంచి రంజీ సమరం


