కార్పెంటర్ అనుమానాస్పద మృతి
తగరపువలస: ఆనందపురం మండలం లొడగలవానిపాలెం పంచాయతీ నేలతేరుకు చెందిన కార్పెంటర్ కడియం కనకరాజు (52) గురువారం సాయంత్రం ఆనందపురం పంచాయతీ పరిధిలోని ఓ కోళ్ల ఫారం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామంలోని కె. శ్రీను అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో షెడ్ల నిర్మాణం కోసం కనకరాజు ఉదయం నుంచి అక్కడే పని చేస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి కూడా వెళ్లి వచ్చిన కనకరాజు.. సాయంత్రం 6.30 గంటల సమయంలో మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు అజయ్ తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని తల్లి రమణమ్మకు చెప్పాడు. రమణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కనకరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కనకరాజుకు తరచుగా మద్యం సేవించే అలవాటు ఉంది. అలాగే ఆయన డయాబెటిస్, బీపీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇది సహజ మరణమా, లేక ప్రమాదం జరిగిందా అన్నది పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్టు ఎస్‌ఐ సంతోష్ తెలిపారు. కనకరాజుకు దేవి అనే కుమార్తె కూడా ఉంది.


