 
															రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలి
బాధిత బోటు యజమానిని ప్రభుత్వం ఆదుకోవాలి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తక్షణమే పరిహారం అందించాం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్
మహారాణిపేట: విశాఖ ఫిషింగ్ హార్బర్ సెంట్రల్ డాక్ ప్రాంతంలో మత్స్యకారుడు మేరుగ ధనరాజుకు చెందిన బోటు తుపాను అలల తాకిడికి మునిగిపోయింది. బాధిత మత్స్యకారుడికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ దక్షిణ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మునిగిపోయిన బోటును పరిశీలించి, బాధిత మత్స్యకారుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ పాలనలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా.. అప్పటి ప్రభుత్వం ముందుండి తక్షణ సహాయక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. గతంలో ఇక్కడ ఒక బోటు కాలిపోతే.. అప్పటికప్పుడే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ మత్స్యకారుడికి రూ.36 లక్షలను అందించిందన్నారు. నేటి కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మునిగిపోయిన బోటుకు తక్షణమే ప్రభుత్వం రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించి, మత్స్యకారుడిని ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానిక మత్స్యకారులు ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
