 
															తునిపొలంలో తీవ్ర విషాదం
గెడ్డలో విద్యార్థిని గల్లంతు
పద్మనాభం : స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు గెడ్డలో పడి విద్యార్థిని గల్లంతవడంతో తునిపొలం గ్రామంలో విషాదం నెలకొంది. మద్ది పంచాయతీ తునిపొలం గ్రామానికి చెందిన కాళ్ల ధనుశ్రీ (12) గురువారం మధ్యాహ్నం మరో ముగ్గురితో కలిసి గ్రామ సమీపంలోని పల్లె గెడ్డ వద్దకు వెళ్లింది. అక్కడ కాలు జారి పడిపోయింది. విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గెడ్డ వద్దకు చేరుకునేసరికే ధనుశ్రీ గల్లంతైంది. కాళ్ల శ్రీను, గౌరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో ధనుశ్రీ చిన్నది. పెద్ద కుమార్తె పద్మనాభం మండలం కృష్ణాపురంలోని కస్తూర్బా విద్యాలయంలో చదువుతోంది. ధనుశ్రీ మద్ది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ధనుశ్రీ గల్లంతు విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ భీమునిపట్నం నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జెడ్పీ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు, ఎంపీపీ కంటుబోతు రాంబాబు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ధనుశ్రీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భీమునిపట్నం ఆర్డీవో సంగీత్ మాధుర్ సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు.
 
							తునిపొలంలో తీవ్ర విషాదం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
