 
															తప్పుల్లో స్మార్ట్
రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు
పేర్లు, వయసులో దొర్లిన తప్పులు
ఇష్టానుసారంగా ముద్రించిన కూటమి ప్రభుత్వం
వీటితో భవిష్యత్‌లో ఇబ్బందులంటున్న కార్డుదారులు
చిరునామా సక్రమంగా లేక
పంపిణీ చేయని 58 వేల కార్డులు
మహారాణిపేట: ఎంతో ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పాత బియ్యం కార్డుల స్థానంలో వచ్చిన ఈ స్మార్ట్ కార్డులు అందుకున్నామని సంతోషించే లోపే, వాటిలోని అంతులేని తప్పులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పేర్లు తారుమారు కావడం, వయసులు తప్పుగా పడటం, చిరునామాలు మారిపోవడంతో.. ఇవి ప్రయోజనం చేకూర్చకపోగా, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు ఎక్కడ దూరం చేస్తాయోనని కార్డుదారులు లబోదిబోమంటున్నారు.
విశాఖ జిల్లా వ్యాప్తంగా 642 రేషన్ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 5,17,155 రేషన్ కార్డులున్నాయి. గతంలో కార్డుదారులకు మాన్యువల్‌గా తయారుచేసిన రేషన్ కార్డులను పంపిణీ చేసేవారు. ఇలా కాదని.. తాము వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టామని, స్మార్ట్ కార్డులు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అనుకున్నదే తడవుగా ఎలాంటి పరిశీలన లేకుండానే ఇష్టమొచ్చినట్లు కార్డులు ముద్రించేసింది. పంపిణీ బాధ్యతను గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి, రేషన్ డీలర్లకు అప్పజెప్పింది. ఇలా జిల్లాకు చేరిన మొత్తం 5,17,155 స్మార్ట్ కార్డులను సెప్టెంబర్ 26 నుంచి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 4,58,759 కార్డులు అంటే 89 శాతం పంపిణీ చేసినట్లు డీఎస్‌వో వి.భాస్కరరావు తెలిపారు. ఇంకా 58,396 కార్డులు పంపిణీ కావాల్సి ఉంది. అయితే కార్డుల కోసం చాలా మంది లబ్ధిదారులు రేషన్ డిపోలు, వార్డు సచివాలయాలు, ఏఎస్‌వో, డీఎస్‌వో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ‘మా దగ్గర లేవు’ అనే సమాధానమే వస్తోందని వాపోతున్నారు.
చిరునామాలు గల్లంతయ్యాయ్..
కొత్తగా ముద్రించిన స్మార్ట్ కార్డుల్లో తప్పులకు కొదవే లేదు. భార్య స్థానంలో కూతురి పేరు, ఒక ప్రాంతంలో నివసించే వారికి మరో ప్రాంతం చిరునామా(ఉదాహరణకు కంచరపాలెంలో ఉన్నవారికి వేపగుంట, పెందుర్తి అని ముద్రించడం), పిల్లల పేర్లు పూర్తిగా గల్లంతు కావడం, వయసుల్లో భారీ తేడాలు, పేర్లలో అక్షరదోషాలు, చివరకు జిల్లాలు కూడా తప్పుగా ముద్రించి ఉన్నాయని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ రేషన్ కార్డు కేవలం నిత్యావసర సరుకులకే కాకుండా, పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ఆరోగ్య ప్రయోజనాలకు అత్యంత కీలకం. ఆధార్, మొబైల్ నంబర్‌తో అనుసంధానించే ఈ కీలక పత్రంలో వివరాలు తప్పుగా ఉంటే, భవిష్యత్తులో అధికారులు పథకాలను తిరస్కరించే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. అయితే, ఈ తప్పులను ఎలా సవరించుకోవాలో తెలియక ప్రజలు పూర్తి అయోమయంలో ఉన్నారు. సచివాలయాలకు వెళితే ‘ఇంకా సవరణకు ఆప్షన్ రాలేదు’ అని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. తప్పులతో కార్డులు ముద్రించి, ఇప్పుడు సవరణకు అవకాశం ఇవ్వకపోవడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి.. తప్పుల సవరణకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కార్డుల ముద్రణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు.
ప్రజల నుంచి ఛీత్కారాలు
అనుకున్నదొకటి..అయ్యిందొకటి.. అన్న చందంగా ఉంది కూటమి సర్కారు తీరు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాల ముద్రను చెరిపేసేందుకు కూటమి సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అమ్మ ఒడి, రైతు భరోసా, పెన్షన్ కానుక,ఆరోగ్యశ్రీ వంటి వాటి పేర్లు మార్చేసింది. తాజాగా రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులు అందిస్తోంది. అయితే ఈ ప్రక్రియ హడావుడిగా చేపట్టడంతో స్మార్ట్ కార్డులు తప్పుల తడకలుగా ఉన్నాయని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. స్మార్ట్ కార్డుల పేరిట హడావుడి చేసి.. క్రెడిట్ కొట్టేద్దామనుకున్న ప్రభుత్వానికి చివరకు ప్రజల నుంచి ఛీత్కారాలే ఎదురవుతున్నాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
