
సమాచార శాఖ మంత్రి దృష్టికి జర్నలిస్టుల సమస్యలు
మహారాణిపేట: రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కోరారు. శనివారం ఆయన నాయకత్వంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.నారాయణ్, జి.శ్రీనివాస్, ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, మదన్‌లతో కలిసి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి జర్నలిస్టులకు త్వరలో హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని, వాటి ప్రీమియంలో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల పింఛన్ల విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలు లేదా ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, త్వరలో దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చినట్టు శ్రీనుబాబు తెలిపారు. అనంతరం న్యూస్‌పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రామచంద్రరావు తదితరులు మంత్రిని కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించారు.