కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి

May 11 2025 12:34 PM | Updated on May 11 2025 12:34 PM

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి

కంచరపాలెం: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జె.వి.సత్యనారాయణమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. సీపీఐ విశాఖ జిల్లా మహాసభల సందర్భంగా కంచరపాలెం మెట్టు నేతాజీ కూడలి నుంచి పాత ఐటీఐ జంక్షన్‌ వరకు శనివారం పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలనే ఇంకా అమలు చేయలేదన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని ప్రశ్నించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఎప్పుడిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను రైతాంగ పోరాటం స్ఫూర్తితో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వానికి అమరావతి తప్ప మరొకటి కనిపించడం లేదని విమర్శించారు. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా.. అమరావతిలో మరో విమానాశ్రయం అవసరమేముందని ప్రశ్నించారు. నెల రోజుల కిందట రిజిస్టర్‌ అయిన సంస్థకు విశాఖలో 99పైసలకు భూములు కేటాయించడం దారుణమన్నారు. విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి భూములు కనిపించడం లేదని మండిపడ్డారు. జిల్లా నాయకులు ఎం.పైడిరాజు, మానం ఆంజనేయులు, ఎ.జె.స్టాలిన్‌, సిహెచ్‌ రాఘవేంద్రరావు, డి.ఆదినారాయణ, పి.చంద్రశేఖర్‌, ఎం.మన్మధరావు, జి.రాంబాబు, కె.సత్యాంజనేయ, కె.సత్యనారాయణ, రెహమాన్‌, శ్రీనివాసరావు, క్షేత్రపాల్‌, నాయుడు, నాగభూషణం పాల్గొన్నారు.

అమరావతి తప్ప వారికి మరొకటి కనిపించడం లేదు

సీపీఐ సహాయ కార్యదర్శుల విమర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement