సెల్ఫీ వీడియో కలకలం: ఉక్కు ఉద్యోగి దంపతుల కథ విషాదాంతం

- - Sakshi

కూర్మన్నపాలెం/అనకాపల్లి : మేము వెళ్లిపోతున్నాం అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని అదృశ్యమైన ఉక్కు ఉద్యోగి చిత్రాడ వరప్రసాద్‌, అతని భార్య మీరా మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. అనకాపల్లి సమీప కొప్పాక వద్ద ఉన్న ఏలేరు కాలువ ఒడ్డున వరప్రసాద్‌ బైక్‌, చెప్పులు, మీరా బ్యాగు లభించిన చోటుకు రెండు కిలోమీటర్ల దూరంలోని రాజుపాలెం రైల్వేగేటు సమీపంలోని కాలువలో మృతదేహాలు లభ్యమయ్యాయి. గాజువాకలోని వడ్లపూడి తిరుమలనగర్‌కు చెందిన ఉక్కు ఉద్యోగి చిత్రాడ వరప్రసాద్‌(47) ఉక్కు కర్మాగారంలోని ఎస్‌ఎంఎస్‌ – 2 విభాగంలో పనిచేసేవారు. అతనికి 41 ఏళ్ల భార్య మీరా, కుమారుడు కృష్ణసాయితేజ(19), కుమార్తె దివ్యలక్ష్మి (23) ఉన్నారు. కుమార్తెకు గతేడాది వివాహం జరిపారు.

కుమారుడు కృష్ణసాయితేజ బ్యాటరీ షాప్‌ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు ఎక్కువై అప్పులు తీర్చలేక తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. సెల్ఫీ వీడియో బయటకు రావడంతో వారి కుమారుడు కృష్ణసాయితేజ దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి తండ్రి వరప్రాద్‌ ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా వెతగ్గా అనకాపల్లి జిల్లా కొప్పాక ఏలేరు కాలువ దగ్గర వరప్రసాద్‌ ఫోన్‌, చెప్పులు, హ్యాండ్‌ బ్యాగు గుర్తించారు. దువ్వాడ ఎస్‌ఐ కె.దేముడునాయుడు సమాచారంతో అనకాపల్లి గ్రామీణ ఎస్‌ఐ నరసింగరావు ఐదుగురు గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలకు ఎన్టీఆర్‌ వైద్యాలయంలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.

రోదనలతో మిన్నంటిన తిరుమలనగర్‌
సెల్ఫీ వీడియో తీసి అదృశ్యమైన దంపతుల మృతదేహాలు లభ్యం కావడంతో తిరుమలనగర్‌లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేకే తమ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారని కుమార్తె దివ్యలక్ష్మి వాపోయారు. నిత్యం ఇంటికి వచ్చి దుర్భాషలాడడం, రోడ్డు మీదే పరువు తీస్తామంటూ అసభ్య పదజాలంతో దూషించడంతో తట్టుకోలేకే వారు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top