కోమాలోకి రైతు... కాపాడిన కిమ్స్‌ ఐకాన్‌ వైద్యులు

ప్రాణాలతో 
బయటపడిన రైతు - Sakshi

అక్కిరెడ్డిపాలెం : కోమాలోకి వెళ్లిన రైతుకు కిమ్స్‌ ఐకాన్‌ వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. షీలానగర్‌ కిమ్స్‌ ఐకాన్‌ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ సీహెచ్‌.విజయ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల రైతుకు ఈ నెల 13న ఉదయం 6 గంటల సమయంలో కడుపు నొప్పి వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే వైద్యుడికి చూపించగా స్కానింగ్‌ చేయాలని చెప్పారు. ఆ సమయంలో స్కానింగ్‌ చేయడానికి వీలుకాకపోవడంతో రైతును ఇంటికి తీసుకెళ్లిపోయారు. దీంతో రైతు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. కాళ్లు, చేతులు కదల్లేని పరిస్థితి. బతికున్నాడో లేదో కూడా తెలియకపోవడంతో కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కోమాలో ఉన్న రైతును వైద్యులు పరీక్షించగా ప్రాణం ఉందని గుర్తించి, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స ప్రారంభించారు. న్యూరాలజీ పరీక్షలు చేయగా రోగి అంతర్గత వ్యవస్థ బాగానే ఉందని తేలింది. కళ్లకు సంబంధించిన నరాలు పరీక్షిస్తే అవి స్పందించలేదు. ఊపిరి బాగా బరువుగా తీసుకోవడం, గుండె నిమిషానికి 100 సార్లకుపైగా కొట్టుకోవడం, బీపీలో తేడాలు ఉన్నట్లు గమనించారు. తొలుత కొన్ని మందులు ఇచ్చినా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగు కాలేదు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కోమాలో ఉన్న రైతు పాము కాటుకు గురై ఉంటాడని భావించి విరుగుడు మందు ఇచ్చారు. దీంతో అతని అవయవాలు మెల్లమెల్లగా సాధారణ స్థితికి వచ్చాయి. దాదాపు బ్రెయిన్‌డెడ్‌ పరిస్థితుల్లోకి వెళ్లిన రైతుకు వారం రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందించినట్లు వెల్లడించారు. మంగళవారం అతన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top