
దార్లిపుట్ స్టేషన్ వద్ద సదుపాయాలపై ఆరా తీస్తున్న కమిటీ సభ్యులు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): రైల్వే బోర్డుకు చెందిన ప్రయాణికుల సదుపాయాల కమిటీ(పాసింజర్ ఎమినిటీస్ కమిటీ–పీఏసీ) సభ్యులు వాల్తేర్ డివిజన్‌లో మంగళవారం కూడా పర్యటించారు. కొత్తవలస–కోరాపుట్ లైన్‌లో ఉన్న గోరాపుర్, దార్లిపుట్, మచ్‌ఖండ రోడ్ స్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. తాగునీరు, విశ్రాంత గదులు, మరుగుదొడ్లు, ప్లాట్‌ఫాం పైకప్పులు, పాదచారుల వంతెనలు, కేటరింగ్ స్టాళ్లు, తదితర సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా స్టేషన్లలో పరిశుభ్రత, స్టాళ్ల వద్ద ఆహార నాణ్యతను కూడా కమిటీ సభ్యులు తనిఖీ చేశారు. ప్రయాణికులతో మాట్లాడి, సూచనలు, సలహాలు తీసుకున్నారు. డివిజన్ పరిధిలోని వివిధ రైల్వేస్టేషన్లలో కమిటీ సభ్యులు దిలీప్‌కుమార్ మల్లిక్, అభిజిత్‌దాస్, నిర్మలకిషోర్ బొల్లిన, గొట్టాల ఉమారాణి, డాక్టర్ జి.వి.మంజుల, పరశురాం మహతో ఈ నెల 30వ తేదీ వరకు పర్యటించనున్నట్టు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ పర్యటనలో వాల్తేర్ డివిజన్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అవినాష్ శర్మ, ఎలక్ట్రికల్, సిగ్నల్, టెలికం, సివిల్ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.