
సంఘీభావం తెలుపుతున్న అఖిలపక్ష నేతలు
సీతంపేట: రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం జాతీయ ప్రాజెక్టు భవితవ్యం అగమ్యగోచరంగా తయారైందని అఖిల పక్ష నేతలు అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించకుండా నిర్మాణం చేపట్టాలని సీపీఐ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో నిర్వహించిన చర్చా గోష్టిలో డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ, జనసేన, సీపీఎం, కాంగ్రెస్, ఆప్, లోక్‌సత్తా పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించి జాతికి అంకితం చేయాల్సి ఉండగా.. పాలకుల కుటిల రాజకీయంతో ముందుకు కదలడం లేదన్నారు. డ్యామ్ ఎత్తు తగ్గిస్తే నీటి నిల్వ సామర్థ్యం 196 టీఎంసీల నుంచి 92కు తగ్గిపోతుందన్నారు. ఎత్తు తగ్గించడం ద్వారా ముంపునకు గురయ్యే ప్రభావిత ప్రాంతం తగ్గుతుందన్నారు. తద్వారా భూసేకరణ చేపట్టాల్సిన ప్రాంతం తగ్గి పునరావాసం, పరిహారం కింద అయ్యే ఖర్చు తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. దీంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల ఆశలు అడియాసలవుతాయన్నారు. డ్యామ్‌ను 45.75 మీటర్ల ఎత్తుతో 196.60 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి చేయాలని, పోలవరం ప్రాజెక్టు పరిధిలోని 8 మండలాల్లో నిర్వాసితులకు పునరావాసం, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆచార్య కె.ఎస్.చలం, జనసేన నాయకుడు కోన తాతారావు, టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, లోక్‌సత్తా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జి.గోవిందరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, నాయకులు లోకనాథం, ఎం.పైడిరాజు, బి.వెంకటరమణ పాల్గొన్నారు.
చర్చాగోష్టిలో అఖిల పక్ష నేతలు