నారాయణ కాలేజీ విద్యార్థిని బలవన్మరణం

సాయిశ్రీ (ఫైల్‌) - Sakshi

బోయపాలెం క్యాంపస్‌లో విషాదం

పీఎం పాలెం : అనారోగ్యం, చదువులో మార్కులు సరిగ్గా రావన్న వేదనతో ఓ విద్యాకుసుమం రాలిపోయింది. సోమవారం సాయంత్రం జరిగిన సంఘటనకు సంబంధించి పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం జన్నవలస గ్రామానికి చెందిన ముమ్మిన వెంకట చిరంజీవి లారీ డ్రైవర్‌ కాగా భార్య ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తుంది. వారికి ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె సాయిశ్రీ (17) బోయపాలెంలోని నారాయణ జూనియర్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం ఎంపీసీ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రాస్తోంది. ఆమె చాలా కాలం నుంచి కడుపు నొప్పితో బాధపడుతోంది. అనారోగ్యం కారణంగా చదువులో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతోంది. ఈ విషయమై మానసికంగా కుంగిపోయింది. సోమవారం ఫిజిక్స్‌ పరీక్ష సరిగా రాయనందున మార్కులు తక్కువగా వస్తాయని మనస్తాపం చెందింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రూమ్‌లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అంతకు ముందు తన మరణానికి గల కారణం సూసైడ్‌ నోట్‌లో రాసింది. తనకు మార్కులు తక్కువ వస్తే కష్టపడి చదివిస్తున్న అమ్మనాన్నల ముందు తలెత్తుకోలేనని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. చెల్లి బాగా చదువుకుని అమ్మనాన్నలకు మంచి పేరు తేవాలని, తనను క్షమించమని ఆ నోట్‌లో పేర్కొంది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించిన కళాశాల సిబ్బంది వెంటనే కొమ్మాది గాయత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి ఎస్‌ఐ వెంకటరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top